calender_icon.png 30 December, 2025 | 10:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతి పాఠశాలలో మరుగుదొడ్లు ఉండాలి

30-12-2025 08:01:19 PM

జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి 

వనపర్తి టౌన్: జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్ల సౌకర్యం తప్పక ఉండాలని, లేని పాఠశాలల్లో నిర్మించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ ప్రభుత్వ పాఠశాలల్లో శౌచాలయాలు, అంగన్వాడీల్లో తాగునీటి వసతి, మరుగుదొడ్ల నిర్మాణం అంశాలపై అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్యతో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

జిల్లాలో మరుగుదొడ్ల సౌకర్యం లేని ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించిన నివేదికను విద్యాశాఖ అధికారుల ద్వారా తెప్పించుకుని కలెక్టర్ పరిశీలించారు.అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ మరుగుదొడ్ల సౌకర్యం లేని పాఠశాలల్లో ఎన్ఆర్ఈజీఎస్ కింద టాయిలెట్స్ మంజూరు చేసి వెంటనే పనులు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ ప్రక్రియను పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు త్వరిత చేపట్టాలని, మార్చ్ 31వ తేదీ లోపు పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 

అదేవిధంగా జిల్లాలోని 35 అంగన్వాడీ కేంద్రాల్లో ఈ డబ్ల్యూ ఐ డి సి ఇంజనీరింగ్ ఆధ్వర్యంలో తాగునీటి వసతి కోసం చేపట్టిన పనులపై పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు కేవలం 9 అంగన్వాడీల్లో మాత్రమే తాగునీటి వసతికి పనులు పూర్తి చేసినట్లు, ఇంకా 26 అంగన్వాడీల్లో పనులు పురోగతిలో ఉన్నాయని చెప్పగా ఆయా పనులని జనవరి మొదటి వారంలోపు పూర్తి చేయాలని ఆదేశించారు. అదేవిధంగా అంగన్వాడీల్లో టాయిలెట్లు నిర్మాణం కోసం మంజూరైన పనులను కూడా జనవరి మొదటి వారంలోపు పూర్తి చేయాలని ఈడబ్ల్యుఐడీసీ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

అంతేకాకుండా, ప్రభుత్వానికి చెందిన పలు శాఖల పరిధిలో గత పదిహేళ్లుగా క్లైమ్ చేయని బ్యాంకు అకౌంట్లు ఉంటే వాటి సమాచారం తెలుసుకొని వెంటనే వాటిని ఆక్టివేట్ చేసుకోవాలని సూచించారు. తద్వారా ఆయా క్లైమ్ చేయని అకౌంట్లో ఉన్న నగదును ప్రజాప్రయోజనార్థం పనులకు వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. అదేవిధంగా అన్ని పాఠశాలల్లో కలెక్టర్ నిధుల నుంచి గ్యాస్ కనెక్షన్లు ఇప్పించడం జరిగిందని, ఇప్పుడు ఆయా పాఠశాలల్లో గ్యాస్ కనెక్షన్ వినియోగిస్తున్నారా ఇంకా కట్టెల పొయ్యి మాత్రమే వాడుతున్నారా? అన్ని జిల్లా విద్యాశాఖ అధికారిని ఆరా తీశారు.

తప్పనిసరిగా అన్ని పాఠశాలల్లో గ్యాస్ సిలిండర్ ద్వారా మాత్రమే వంట చేయాలని కట్టేల పోయి వినియోగించడం జరగవద్దని ఆదేశించారు.ఈ సమావేశంలో సమావేశంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారిని ఉమాదేవి, పంచాయతీ రాజ్ కార్యనిర్వాహక ఇంజనీర్ మల్లయ్య, ఈడబ్ల్యుఐడీసీ ఇంజనీరింగ్ అధికారులు, జిల్లా విద్యాశాఖ అధికారి అబ్దుల్ ఘని ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.