calender_icon.png 30 December, 2025 | 10:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చే సంస్థ

30-12-2025 07:57:26 PM

జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్

హనుమకొండ,(విజయక్రాంతి): ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హనుమకొండ జిల్లా సర్వసభ్య సమావేశం  మంగళవారం హనుమకొండ సమీకృత జిల్లా కార్యాలయ భవనంలో జిల్లా కలెక్టర్, రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షురాలు స్నేహ శబరీష్  అధ్యక్షతన ఘనంగా నిర్వహించబడింది. ఈ సమావేశానికి ముందు జిల్లా కలెక్టర్, రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షురాలు స్నేహ శబరీష్, రెడ్ క్రాస్ పాలకవర్గ సభ్యులతో కలిసి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వ్యవస్థాపకులు జీన్ హెన్రీ డ్యూనాంట్, రక్తదాన ఉద్యమ పితామహులు కార్ల్ ల్యాండ్‌స్టైనర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

అనంతరం  హనుమకొండ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ పి. విజయచందర్ రెడ్డి మాట్లాడుతూ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా 2022–23, 2023–24 మరియు 2024–25 సంవత్సరాలకు సంబంధించిన వార్షిక నివేదికలు, ఆడిటెడ్ అకౌంట్లు, అలాగే రాబోయే సంవత్సరానికి ఆదాయ,వ్యయ అంచనాలను సర్వసభ్యులకు వివరించారు. ఈ వార్షిక నివేదికను సోదా రామకృష్ణ ప్రతిపాదించగా, మండల పరశురాములు బలపరిచారు. అలాగే 2025–26 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను బండి సారంగపాణి ప్రతిపాదించగా, ఓరుగంటి లైలా బలపరిచారు.

ఇందుకు సమావేశానికి హాజరైన సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా హనుమకొండ రెడ్ క్రాస్ సొసైటీకి నిరంతరం సహాయ సహకారాలు అందిస్తున్న జిల్లా కలెక్టర్ కి పాలకవర్గ సభ్యులు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. అనంతరం జిల్లా కలెక్టర్  స్నేహ శబరీష్ మాట్లాడుతూ, రెడ్ క్రాస్ సొసైటీ సేవాతత్పరతతో ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చే సంస్థ అని, ప్రస్తుత పాలకవర్గం అనేక సేవా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించిందని ప్రశంసించారు.