19 July, 2026 | 3:47 AM

యువ సంగ్రామంలో అంతా పెయిడ్ ఆర్టిస్టులే!

19-07-2026 12:38 AM

నిరుద్యోగులే లేరు, బీఆర్‌ఎస్ కార్యకర్తలే

మీరిచ్చింది నిరాశ, మేమిచ్చింది భరోసా

కళ్లముందే ఉద్యోగాల రికార్డులు

వయోపరిమితిని పెంచి ఊరట కల్పించాం

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ 

హైదరాబాద్, జూలై 18 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ యువ సంగ్రామ సదస్సులో ‘అంతా పెయిడ్ ఆర్టిస్టు’లే ఉన్నారని, అందులో నిరుద్యోగ యువతే లేరని, అంతా బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలున్నారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ విమర్శించారు. శనివారం సీల్పీలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేటీఆర్ ‘మీది పేపర్ లీకుల పాలన.. మాది కొలువుల జాతర’ అన్నారు.

మీ హయాంలో నిరుద్యోగుల చేతిలో హాల్‌టికెట్ ఉండేదని, ప్రజా ప్రభుత్వంలో అపాయింట్‌మెంట్ లెటర్ ఉందన్నారు. మీరు యువతకు ఇచ్చింది నిరాశ అయితే.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది ఉద్యోగ భరోసా అన్నారు. తాము శిల్పకళా వేదికగా, ఎల్బీ స్టేడియంలో ఉద్యోగ నియామక పత్రాలు పంచామని, రెండేండ్లలో 67,763 మందికి ఉద్యోగాలు ఇచ్చిన రికార్డు కళ్ల ముందే ఉందన్నారు. ఇంకా 13,197 పో స్టులు భర్తీ చివరి దశలో ఉన్నాయని, తమ ప్రభుత్వం మాటలు చెప్పదని, దశల వారీగా ఉద్యోగాలు ఇస్తోందన్నారు.

టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసి మళ్లీ యువతలో నమ్మకం గెలుచుకున్నామన్నారు. గ్రూప్-1,2, 3 పరీక్షలను విజయవంతంగా నిర్వహించామన్నారు. టీజీపీఎస్సీ ద్వారానే మొత్తం 17,326 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని, మెగా డీఎస్సీ ద్వారా 10,006 మంది కొత్త టీచర్లను పాఠశాలలకు పంపామన్నారు. గురుకులాల్లో 8,400 మంది ఉపాధ్యాయులను నియమించి వేలాది పేద పిల్లల భవిష్యత్తును బలోపేతం చేశామన్నారు. పోలీస్‌శాఖలో 16,067 మంది యువతకు ఉద్యోగాలు ఇచ్చామని, వయోపరిమితిని 34 నుంచి 44 ఏళ్లకు పెంచి పదేళ్ల ఊరట కల్పించామని తెలిపారు. కేటీఆర్ ఉపన్యాసాలు ఇవ్వడం ఆపి, పేపర్ లీకేజీలకు యువతకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.