కల్తీ కట్టడికి కఠిన చట్టం
- సమాచారానికి టోల్ ఫ్రీ వ్యవస్థ
- శాసనసభలో సమగ్ర చర్చకు సిద్ధం
- పైలెట్ ప్రాజెక్టుగా క్యూర్ పరిధిలో అమలు
- సమీక్ష సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, జూలై 18 (విజయక్రాంతి) : ఆహార, ఔషధాల కల్తీల నిరోధానికి కఠిన చర్యలు రూపొందించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. కూరగాయలు, పండ్లు, పాలు తదితర ఆహారపదార్థాలన్నీ కల్తీ అవుతుండటంతో ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారని పేర్కొన్నారు. తెలంగాణ ఆహార కల్తీ, ఔషధ నియంత్రణ చట్టంపై ఎంసీహెచ్‌ఆర్డీలో శనివారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో సీఎం మాట్లాడారు. ఆకుకూరలు, కూరగాయలు, పాలు ఎక్కువ రోజులు నిల్వ ఉండేందుకు, పండ్లు త్వరగా మగ్గేందుకు విచ్చలవిడిగా రసాయనాలు వాడుతున్నారని స్పష్టం చేశారు. పంటలకు ఎరువులు, పురుగు మందులు విచ్చలవిడిగా వినియోగిస్తుండటంతో వాటి ఉత్పత్తుల్లో రసాయన అవశేషాలు బయటపడి దిగుమతికి విదేశాలు నిరాకరిస్తున్నాయన్నారు.
మార్కెట్‌లో సేంద్రియ ఉత్పత్తుల పేరుతో అధిక ధరలకు పండ్లు, కూరగాయల వంటివి అమ్ముతున్నారని, అవి సేంద్రియ ఉత్పత్తులే అని నిర్ధారించేందుకు సరైన వ్యవస్థలు లేవన్నారు. కల్తీల నిరోధానికి సమగ్ర చట్టాలు అమలు చేస్తున్న దేశాలను సందర్శించి అక్కడి విధానాలను అధ్యయనం చేయాలని, వాటి ఆధారంగా నివేదికను తయారు చేయాలని సూచించారు. దానిపై బిల్లు రూపొందించి శాసనసభలో సమగ్రమైన చర్చ చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. అదే విధంగా ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకోవాలని, కల్తీల సమగ్ర సమాచార సేకరణకు విజిల్ బ్లోయర్లను నియమించాలని, టోల్ ఫ్రీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
కల్తీలకు నిరోధానికి తొలుత క్యూర్ ప్రాంతాలన్ని పైలెట్ ప్రాజెక్టుగా తీసుకోవాలని సూచించారు. ఇక్కడ వచ్చే ఫలితాల ఆధారంగా ముందుకెళ్లాలని అధికారులకు స్పష్టం చేశారు. సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, డీజీపీ సీవీ ఆనంద్, సీఎం సలహాదారు కే.రామకృష్ణారావు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీలు వీ.శేషాద్రి, ఎన్.శ్రీధర్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.






