రెండో విడత ఎన్నికల్లో నూరుశాతం ఓటింగ్‌లో పాల్గొనాలి
- ఎన్నికల సామాగ్రి పంపిణీ ప్రణాళికబద్ధంగా పూర్తి చేయాలి
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్
మెదక్, డిసెంబర్ 12(విజయక్రాంతి):2వ సాధారణ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ఈనెల 14న జరగనున్న 2వ విడత పోలింగ్ నిర్వహణ కొరకు ఎన్నికల సామాగ్రిని కేటాయించిన ప్రకారం ప్రణాళికాబద్ధంగా పంపిణీ పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. శుక్రవారం మెదక్ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన 2వ విడత ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని సందర్శించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నూరు శాతం ఓటింగ్ లక్ష్యంగా ప్రజలు ఓటింగ్ లో పాల్గొనాలని తెలిపారు. జిల్లాలో పంచాయతీ ఎన్నికలు పకడ్బందీగా జరిగేందుకు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఓటింగ్, కౌంటింగ్ కొరకు అవసరమైన సామాగ్రి పంపిణీ చేయడంతో పాటు ఎన్నికల అధికారులు, సిబ్బందిని నియమించడం జరిగిందని తెలిపారు.
పారదర్శకమైన ఎన్నికలు జరిగేలా అధికారులు తమకు కేటాయించిన విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌ఓ భుజంగరావు, తాసిల్దార్ లక్ష్మణ్ బాబు, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి,ఎంపీడీవో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.






