calender_icon.png 13 December, 2025 | 8:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిన్నకాపర్తిలో రిగ్గింగ్ కలకలం!

13-12-2025 01:49:34 AM

  1. మురికి కాల్వలో బ్యాలెట్ పేపర్లు 
  2. అధికార పార్టీ అరాచకాలను ఎండగడతాం: చిరుమర్తి 

నకిరేకల్/చిట్యాల, డిసెంబర్ 12(విజయక్రాంతి): నల్లగొండ జిల్లా చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామంలో గురువారం జరిగిన సర్పంచ్ పంచాయతీ ఎన్నికల్లో రిగ్గింగ్ చేసి అధికార పార్టీకి చెందిన అభ్యర్థిని గెలిచినట్లుగా ఎన్నికల అధికారులు ప్రకటించినట్లు ఓడిపోయిన రుద్రారపు భిక్షపతి, ఆయన అనుచరులు ఆరోపించారు. ఈ రిగ్గింగ్‌కు ఎన్నికల సిబ్బంది కూడా పూర్తిగా సహకరించారని ఆయన పేర్కొన్నారు.

భోజన విరామ సమయంలో ఏజెంట్లు అందర్నీ బయటకు పంపించి బ్యాలెట్ బాక్స్ లను ఓపెన్ చేసి తమకు పడ్డ కత్తెర గుర్తులకు సంబంధించిన బ్యాలెట్ పత్రాలను తీసివేసి గెలిచిన అభ్యర్థి రింగు గుర్తుపై ఓట్లు వేసినట్లు భిక్షపతి ఆరోపించారు. పోలింగ్ స్టేషన్‌కు వెనకాల డ్రైనేజీలో తమ గుర్తు కత్తెరకు పడ్డ ఓట్లకు సంబంధించిన బ్యాలెట్ పేపర్లు కట్టలు కట్టలుగా పడవేయడం తాము గుర్తించినట్లు తెలిపారు. బ్యాలెట్ పేపర్లు సుమారు 300 పైగా ఉన్నాయని, దీనిపై తాము జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసి ఎన్నికను రద్దయ్యేలా పోరాడుతామని భిక్షపతి అన్నారు. 

జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం: మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి 

అధికారం చేతిలో ఉంది కదా అని అప్రజాస్వామికంగా గెలిచేందుకు ప్రయత్నించిన అధికార పార్టీ నేతలపై, అందుకు సహకరించిన అధికారులపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేయ డమే కాకుండా న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగ య్య అన్నారు. గ్రామంలో బీఆర్‌ఎస్‌కు చెం దిన అభ్యర్థి గెలుపు ఖాయం అనుకున్న తరుణంలో ఇ లాంటి కుట్రలు కుతంత్రాలు పన్ని తాము గెలిచినట్లు ప్రకటించుకోవడం సిగ్గుచేటన్నారు. 

పూర్తిస్థాయి విచారణ జరుపుతాం:  కలెక్టర్

 మొదటి విడత  పంచాయతీ ఎన్నికల్లో పోలైన బ్యాలెట్ పత్రాలు బయటకు వచ్చిన ఘటనపై జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ వ్యవహారంలో  స్టేజ్2 ఆర్‌ఓను సస్పెండ్ చేస్తున్నట్లు కలెక్టర్ ప్రకటించారు.బ్యాలెట్ పేపర్లను బయటకు తెచ్చిన పేరు తెలియని వ్యక్తిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తున్నట్లు కూడా ఆమె వెల్లడించారు. ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.