పర్యావరణ పరిరక్షణపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి
ఎమ్మెల్యే ముఠా గోపాల్
ముషీరాబాద్, జూలై 9 (విజయక్రాంతి): పర్యావరణ పరిరక్షణపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండి కాలుష్య రహిత సమాజ స్థాపనకు కృషిచేయాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ పేర్కొన్నారు. గురువారం ముషీరాబాద్ ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, సాఖీ వాటర్స్ స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో వాటర్ ప్లాంట్ ను ప్రారంభించి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతిరోజు మధ్యాహ్న భోజనం వల్ల ఘణనీయమైన జీవ వ్యర్థాలు ఉత్పన్నమవుతున్నాయని తెలిపారు. ఆహారం వృధా కాకుండా విద్యార్థులు వ్యవహరించాలన్నారు. వ్యర్థాల వర్గీకరణ చేసి స్థానికంగా ఉన్న పూలమొక్కలు, చెట్ల వృద్ధికి ఎరువులుగా వాడాలని సూచించారు. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలని సూచించారు.
పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే ఆరోగ్యవంతులుగా ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ యువ నాయకుడు ముఠా జైసింహ, సాఖీ వాటర్ స్వచ్చంద సంస్థ ప్రతినిధి డాక్టర్ జ్యోతి చౌరీ, మున్వర్ చాంద్, భోలక్ ప్పూర్ బీఆర్‌ఎస్ అధ్యక్షుడు వై. శ్రీనివాసరావు, ఉపాధ్యక్షుడు ఆర్ శ్రీనివాస్, ముషీరాబాద్ విద్యామండలి డిప్యూటీ ఈవో లక్ష్మణ్ సింగ్, ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్, రత్నం తదితరులు పాల్గొన్నారు.






