అచ్చతెలుగు అందరివాడు
మట్టి గుండె నుంచి విత్తనం మొలకెత్తి.. చెట్టుగా ఎదిగే క్రమంలో ఎన్నో ప్రాకృతిక ఆటుపోట్లు. ఆరు రుతువులను ఆప్యాయంగా హత్తుకుని.. పచ్చదనాన్ని పరుచుకుని.. సగర్వంగా నిలబడుతుంది. మనిషి జీవితమూ అలాంటిదే. కష్టాల్లో కమలాలి.. ఆటుపోట్ల మధ్య రాటుదేలాలి. అప్పుడే నడిచే దారుల్లో వెలుగులు ఉదయిస్తాయి.. విజయాలు వరిస్తాయి.. భావితరాలకు స్ఫూర్తిని పంచుతాయి. తెలుగు తనానికి నిండైన రూపం.. ప్రత్యర్థులు సైతం గౌరవించే అపర చాణక్యుడు.. అసాధ్యమన్నదే ఎరుగని సుసాధక ప్రజ్ఞా నిధి.. విజయాలకు నడకలు నేర్పిన ఆ నిత్యపథికుడు మనమంతా అభిమానించే శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలోని ఓ చిన్న గ్రామం చవటపాలెం. ఈ పల్లెలో 1949 జూలై1న రంగయ్య నాయుడు, రమణమ్మ దంపతులకు వెంకయ్యనాయుడు జన్మించారు. ఓ సాధారణ రైతు ఇంట పుట్టిన ఆయన కోట్లాది జనం గుండెల్లో కొలువయ్యే నాయకుడిగా ఎదిగారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ ఎదురీది ఉన్నత స్థాయికి చేరుకొన్నారు. పసితనంలోనే తల్లిని కోల్పోయిన ఆయన అమ్మమ్మ, తాతయ్య సంరక్షణలో శ్రీరామపురంలో పెరిగారు. అక్కడే ప్రాథమిక విద్యను పూర్తి చేసి, ఉన్నత విద్య కోసం అక్కడి నుంచి 6 కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లేవారు. న్యాయవాది కావాలన్న తల్లి కోరికను తీర్చాలన్న సంకల్పం, తాత ప్రేరణతో నెల్లూరు వీఆర్ కళాశాలలో డిగ్రీ చదివి, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. చిన్నతనం నుంచే ప్రజా సమస్యల పరిష్కారానికై ఉద్యమించటం.. ప్రజా హక్కుల దిక్కుగా నిలవటం వంటి నాయకత్వ లక్షణాలను పుణికిపుచ్చుకున్నారు.
పంచ సప్తతి
వెంకయ్యనాయుడి జన్మదినోత్సవం నేడు హైదరాబాద్‌లో ప్రత్యేక కార్యక్రమం
మాజీ రాష్ట్రపతి బయోగ్రఫీని ఆవిష్కరించనున్న ప్రధాని
హైదరాబాద్, జూన్ 29 (విజయక్రాంతి): మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు 75వ జన్మదినం సందర్భంగా ఆయన జీవితాన్ని ఆవిష్కరిస్తూ రచించిన మూడు పుస్తకాలను ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం ఆవిష్కరించనున్నారు. వెంకయ్యనాయుడి జన్మదినం సందర్భంగా హైదరాబాద్ గచ్చిబౌలిలోని అన్వయ కన్వెన్షన్‌లో పంచ సప్తది పేరిట ప్రత్యేక ఆత్మీయ కలయిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలోనే ఆదివారం మధ్యాహ్నం ౧౨ గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పుస్తకాలను ప్రధాని ఆవిష్కరిస్తారు. వెంకయ్య జన్మదిన కార్యక్రమానికి కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పలువురు రాజకీయ నాయకులు హాజరు కానున్నారు.
ది హిందూ దినపత్రిక మాజీ రెసిడెంట్ ఎడిటర్ ఎస్ నగేష్ కుమార్ ‘వెంకయ్య నాయుడు లైఫ్ ఇన్ సర్వీస్’ గ్రంథంతోపాటు ‘సెలబ్రేటింగ్ భారత్ ది మిషన్ అండ్ మెసేజ్ ఆఫ్ ఇండియా’ గ్రంథం, 13వ ఉపరాష్ర్టపతిగా ఎం వెంకయ్య నాయుడి ఐదేళ్ల ప్రయాణంపై ఆయన మాజీ కార్యదర్శి ఐవీ సుబ్బారావు రచించిన పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు. వెంకయ్య జీవిత చరిత్రను చాయాచిత్రాలతో సంజయ్ కిషోర్ రచించిన ‘మహానేత లైఫ్ అండ్ జర్నీ ఆఫ్ ఎం వెంకయ్య నాయుడు’ పుస్తకాన్ని కూడా ప్రధాని ఆవిష్కరించనున్నారు.
తొలి ప్రాధాన్యం మాతృభాషకే!
ఉప రాష్ట్రపతిగా తన పదవీ కాలం ముగిసిన సందర్భంలో ఏర్పాటు చేసిన వీడ్కోలు కార్యక్రమంలో వెంకయ్యనాయుడు భావోద్వేగ ప్రసంగం విన్నవారు ఇప్పటికీ మర్చిపోలేరు. రాజ్యసభ చైర్మన్, ఉప రాష్ర్టపతి హోదాలో తన చివరి ప్రసంగం అంతా భాషాభిమానంపైనే సాగింది. సభలో మాట్లాడే భాషకు కూడా అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. తొలి ప్రాధాన్యం మాతృభాషకు, తర్వాత సోదర భాషకు ఇవ్వాలన్నారు. సభలో మాతృభాషలో మాట్లాడటాన్ని ప్రోత్సహించాను అని ఆయన చెప్పారు. ప్రపంచం మొత్తం భారతదేశాన్ని చూస్తోందని, ఎగువ సభ మరింత గొప్ప బాధ్యతను కలిగి ఉందని పేర్కొన్నారు. ఎంపీలు సభా గౌరవాన్ని కాపాడాలని సూచించారు. సభలో నిర్మాణాత్మక చర్చలు జరగాలని ఆకాంక్షించారు. ప్రజాస్వామ్యం గౌరవం మరింత పెరిగేలా నడుచుకోవాలని సూచించారు.
“సభ నిర్వహణకు నా వంతు కృషి చేశాను. నేను దక్షిణం, ఉత్తరం, తూర్పు, పశ్చిమం, ఈశాన్యం.. అన్ని వైపుల వారికి అవకాశం కల్పించడానికి ప్రయత్నించాను. సభ గౌరవం కాపాడేందుకు కొన్నిసార్లు కఠినంగా వ్యవహరించాను. సభలో ఎవరూ శత్రువులు ఉండరు. ప్రత్యర్థులే ఉంటారు. పోటీలో ఇతరులను మించిపోవడానికి మనం కష్టపడి పని చేయాలి. కానీ ఇతరులను తగ్గించకూడదు. పార్లమెంటు సజావుగా సాగాలని నా కోరిక, మీ ప్రేమ, ఆప్యాయతలకు నేను చలించాను. నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను” అని వెంకయ్య నాయుడు చేసిన చివరి ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది.
విద్యార్థి నాయకుడిగా..
1972లో జై ఆంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగసింది. విద్యార్థి నాయకుడైన వెంకయ్య ఉద్యమంలో క్రియాశీలక భాగస్వామి అయ్యారు. 1975లో దేశాన్ని ఎమర్జెన్సీ గ్రహణం కమ్ముకున్నప్పుడు ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమంలో భాగంగా జయప్రకాష్ నారాయణ్‌ను ఆంధ్ర విశ్వ విద్యాలయం విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా ఆహ్వానించినందుకు ౧౭ నెలలకుపైగా జైలు నిర్బంధాలను ఎదుర్కొన్నారు. ఆ నిర్బంధాలు ఆయనలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనే దృఢ సంకల్పానికి బీజాలు వేశాయి.
తొలిసారి చట్టసభలోకి..
1978లో జనతా పార్టీ తరుపున ఉదయగిరి నుంచి శాసనసభ్యునిగా వెంకయ్య పోటీ చేశారు. ప్రత్యర్థి తరుపున స్వయంగా ఇందిరాగాంధీ వచ్చి ప్రచార చేసి వెళ్లినా ఉదయగిరి ప్రజలు మాత్రం వెంకయ్య నాయుడికే పట్టం కట్టారు. ఆ తర్వాత 1983లో ఎన్టీఆర్ ప్రభంజనం వీస్తున్నా రెండోసారి విజయపతాకాన్ని ఎగురవేశారు. ఆ తర్వాత పరిస్థితులు ఆయన్ను జాతీయ రాజకీయాలవైపు నడిపించాయి. 1998, 2004, 2010, 2016 సంవత్సరాల్లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు.
వెంకయ్య మాట.. ప్రతిధ్వనించే తూటా
భావవ్యక్తీకరణ సామర్థ్యం నాయకత్వ లక్షణాల్లో మరింత కీలకమైనది. ఓ సమూహాన్ని మాటలతో సమ్మోహితుల్ని చేయటం సాధారణ విషయం కాదు. సరస్వతీ కటాక్షం పుష్కలంగా ఉన్న వెంకయ్య నాయుడు నోరు విప్పితే చాలు, పదాలు పరుగులు పెడుతూ వరుసలో నిలుచుంటాయి. ఆయన వాగ్ధాటి యువతను ఉత్తేజితుల్ని చేస్తుంది. 8 భాషల్లో అనర్గళంగా సాగే వెంకయ్య వాగ్ధాటికి తెలుగు వారే కాదు, ఉత్తరాదివారు సైతం మంత్రముగ్ధులౌతారు. విజయాలనే కాదు వైఫల్యాలను సమదృష్టితో స్వీకరించేవాడే స్థితప్రజ్ఞుడు. నాయుడిలో ఈ లక్షణం పుష్కలం. అందుకే 2004 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయినందుకు, నైతిక బాధ్యతగా పార్టీ అధ్యక్ష పదవి నుంచి స్వచ్ఛందంగా వైదొలగారు.
జగమంత కుటుంబం
జగమంతటినీ కుటుంబంగా భావించే వెంకయ్యనాయుడు కుటుంబానికి ఇచ్చే ప్రాధాన్యత, కుటుంబ సభ్యుల్లో నింపిన స్ఫూర్తి అసాధారణమైనది. 1971 ఏప్రిల్ 14న మస్తాన్ నాయుడు, కౌసల్యమ్మల కుమార్తె ఉషను జీవిత భాగస్వామిగా స్వీకరించారు. వారి కుమారుడు హర్షవర్ధన్, కుమార్తె దీపమ్మ ఇద్దరూ తండ్రికి తగ్గ బిడ్డలే. తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోతున్న సమయంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవిస్తూనే సీమాంధ్ర జనుల ఆవేదనన ఎలుగెత్తారు.
స్వర్ణభారతి.. సంక్షేమ హారతి
పేదరికం అక్షరానికి అవరోధం కాకూడదు. గాంధీజీ కలగన్న గ్రామ స్వరాజ్యం సాకారం కావాలి.. ఇదే స్ఫూర్తితో 2001లో 10 మంది మిత్రుల సహకారంతో వెంకయ్య నాయుడు, ఆయన కుమార్తె దీపావెంకట్ పర్యవేక్షణలో నెల్లూరు జిల్లా వెంకటాచలంలో స్వర్ణభారత్ ఆవిష్కృతమైంది. స్వర్ణభారత్ ట్రస్ట్ ప్రారంభోత్సవం అద్వానీ చేతుల మీదుగా జరిగింది. 2016లో విజయవాడకు, 2017లో హైదరాబాద్ కు ట్రస్ట్ సేవలు విస్తరించాయి.
సంస్కృతికి నిలువెత్తు రూపం
వెంకయ్యనాయుడికి భారతీయ సంస్కృతి అంటే ప్రాణం. మాతృభాషలో మాట్లాడాలన్నా, పంచెకట్టుతో కనిపించాలన్నా చాలా ఇష్టం. దేశ విదేశాల్లో పర్యటించినా పంచెకట్టుతోనే కనిపించేవారు. ఉపరాష్ట్రపతి అయ్యాక డ్రస్ మారుతుందా అని కొందరు అడిగితే... నో ఛేంజ్ ఇన్ మై డ్రస్... ఛేంజ్ ఓన్లీ ఇన్ మై అడ్రస్ అని చమత్కరించారు. ఉపరాష్ట్రపతిగా వెంకయ్య ప్రపంచవ్యాప్తంగా పర్యటించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్, రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో సంప్రదింపులు జరిపారు.
వెంకయ్య ప్రత్యేకం చమక్కులు.. చురుక్కులు
హైదరాబాద్, జూన్ 29 (విజయక్రాంతి): రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలతో పాటు చమక్కులు, చురుక్కులు కూడా ఉండాలని మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ప్రసంగం వింటే అనిపిస్తుంది. ఆయన వాగ్ధాటి ప్రతిపక్షాలను సైతం ఆకట్టుకుంటుంది. సభలో ఉన్న వారందరినీ కట్టిపడేసేలా ఆయన ప్రసంగం ఉంటుంది.
టాక్ ఔట్, వాక్ ఔట్, ఆల్ ఔట్ !
2014లో బీజేపీ అధికారంలోకి వచ్చాకా, ప్రతిపక్ష పార్టీలు సభలో ఒక సీజన్‌లో గట్టి రాద్ధాంతమే చేస్తున్నాయి. అను దినం సభా కార్యక్రమాలకు అడ్డు పడుతున్నారు. ఈ నేపథ్యంలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా వెంకయ్య స్పందించారు. మరొకరు అయితే.. ఏదో సీరియస్‌గా ప్రతిపక్షాలకు క్లాస్ పీకుతారు. కానీ అక్కడ ఉన్నది వెంకయ్య కదా.. ‘పార్లమెంటులో మీరు మాట్లాడితే మాట్లాడాలి (టాక్ ఔట్), లేకపోతే బయటకు వెళ్లిపోవాలి (వాక్ ఔట్), కానీ.. ఇలా సభా కార్యక్రమాలకు అడ్డుపడటం (బ్రేక్ ఔట్) తగదు. ఇలాగే కొనసాగితే ప్రజాస్వామ్యానికే ముప్పు(ఆల్ ఔట్)..’ ఈ విధంగా వెంకయ్య ఇంగ్లిష్ ప్రాసతో క్లాస్ పీకే సరికి, సభలో నినాదాలు చేస్తున్న ఎంపీలు కూడా వాటిని ఆపి నవ్వేశారు!
ఉప రాష్ర్టపతిని కాను, ఉషా పతినే...
వెంకయ్యనాయుడుని ఉప రాష్ర్టపతిగా చేయాలని మోదీ, అమిత్ షా భావిస్తున్నారని చాన్నాళ్లుగానే ప్రచారం జరుగుతున్న సమయంలో ఇందుకు సంబంధించిన ఊహాగానాల నేపథ్యంలో మీడియా ప్రతినిధులు డైరెక్టుగా వెంకయ్యతోనే ఈ విషయాన్ని ఆరా తీశారు. రిపోర్టర్లు చాలా సీరియస్‌గా ‘మీరు కాబోయే ఉప రాష్ర్టపతి అనే ప్రచారం జరుగుతోంది..’ అని అడగగా ‘నేను ఉప రాష్ర్టపతిని కాను.. ఉషా పతిగానే ఉంటాను..’ అని తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు వెంకయ్య. వెంకయ్య భార్య పేరు ఉషా.
పార్టీకి విధేయుడిగా.. ఎంతగా అంటే
తాము ముందుగా జాతికి ఆపై తమ పార్టీకి విధేయులమని చాలా మంది నేతలు చెప్పుకొంటారు. అయితే వెంకయ్య పడికట్టు పదాలకు అతీతుడు కదా. అందుకే ఈ విషయాన్ని కూడా ఆయన స్టుల్లో చెప్పారు ఒకసారి.. అదెలాగంటే..‘నేషన్(జాతి) ఫస్ట్, పార్టీ నెక్ట్స్, అండ్ సెల్ఫ్ లాస్ట్..’
ఎలక్షన్.. కలెక్షన్..
ఇతర రాజకీయ పార్టీలను అన్యాపదేశంగా విమర్శించే క్రమంలో వెంకయ్య ఒకసారి ఎలా స్పందిచారంటే.. ‘కొన్ని రాజకీయ పార్టీలు మూడు నియమాల ఫార్ములాను అనుసరిస్తున్నాయి. అవేమిటంటే.. ఎలక్షన్, సెలెక్షన్, కలెక్షన్..’అంటూ వెంకయ్య చణుకు విసిరారు.
మాకు 4బీల మీద నమ్మకం లేదు-..
2014 ఎన్నికల సమయంలో బీజేపీ సభల్లో పాల్గొనాలంటే రూ.౫ చెల్లించాలనే నియమం పెట్టింది బీజేపీ. ఈ అంశం వెంకయ్య స్పందిస్తూ..‘మాకు నాలుగు బీల మీద నమ్మకం లేదు..’ అన్నారు. ‘బీ’లు ఏమిటి? అంటే.. బస్, బిర్యానీ, బాటిల్, బత్తా.. అని వివరించారు.
- 1970 - నెల్లూరు వీఆర్ కాలేజ్ విద్యార్థి సంఘం ఉపాధ్యక్షుడు
- 1971 - నెల్లూరు వీఆర్ కాలేజ్ విద్యార్థి సంఘం అధ్యక్షుడు
- 1973 - 74 - ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయం విద్యార్థిసంఘం అధ్యక్షుడు
- 1974 జయప్రకాష్ నారాయణ్ యువజన సంఘర్ష్ సమితి ఆంధ్రప్రదేశ్ కన్వీనర్
- 1977 - 80 - జనతాపార్టీ యువమోర్చా అధ్యక్షుడు
- 1978- 83 - నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యేగా తొలిసారి ఎన్నిక
- 1983 - 85 - ఉదయగిరి నియోజకవర్గం నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నిక
- 1980 - 83 బీజేపీ అఖిలభారత యువ విభాగం ఉపాధ్యక్షుడు
- 1980 - 85 బీజేపీ శాసనసభ పక్షనేత
- 1985 - 88 బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
- 1988 - 93 బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
- 1993 - 2000 బీజేపీ జాతీయ కార్యదర్శి
- 1998, ఏప్రిల్ - కర్ణాటక రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యుడిగా తొలిసారి ఎన్నిక
- 2000 సెప్టెంబర్ 2002 జూన్ - కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి
- 2002 - 2003 డిసెంబర్ బీజేపనీ జాతీయ అధ్యక్షుడు (మొదటిసారి)
- 2004 జనవరి - 2004 అక్టోబర్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు (రెండవసారి)
- 2004 జూలై - కర్ణాటక నుంచి రాజ్యసభ సభ్యుడు (రెండో పర్యాయం)
- 2010 జూలై - కర్ణాటక నుంచి రాజ్యసభ సభ్యులు (మూడో పర్యాయం)
- 26 మే 2014 - 5 జులై 2016- కేంద్ర పట్టణాభివృద్ధి, సమాచార ప్రసార, పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి.
- 2016- జూలై రాజస్థాన్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక (నాలుగో పర్యాయం)
- 2017 నుంచి 2022 వరకు భారత ఉపరాష్ట్రపతిగా సేవలు
వెంకయ్య సేవలు ఎంతో విలువైనవి
- ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు
- హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ
విజయక్రాంతి, జూన్ 29 (విజయక్రాంతి): మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దేశానికి అందించిన సేవలు ఎంతో విలువైనవని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రశంసించారు. ఓ సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి స్థాయికి చేరుకోవడం ఎంతో గొప్ప విషయమన్నారు. వర్శిటీ స్థాయిలోనే ఆయన నాయకునిగా సత్తా చాటారని, తెలుగు, హిందీ, ఆంగ్లంలో ఆయన ప్రసంగాలు ఎంతో ఆకట్టుకుంటాయని తెలిపారు. దేశంలో ఎమర్జెన్సీ విధించినప్పుడు ఏడాదిన్నర పాటు మీసా చట్టం కింద జైళ్లో ఉన్నారని, ఎమ్మెల్యేగా ఉంటూ విపక్ష నేతగా అధికార పార్టీని ఇరకాటంలో పెట్టారని గుర్తుచేశారు.
రెండుసార్లు బీజేపీ జాతీయ అధ్యక్షునిగా సేవలందించడం సాధారణ విషయం కాదన్నారు. అద్వానీ, వాజ్‌పేయీ నేతృత్వంలో పనిచేసిన అనుభవశీలి వెంకయ్య అని కొనియాడారు. రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా పనిచేసి తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నారని చెప్పారు. వాజ్‌పేయీ, మోదీ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా దేశానికి సేవ చేశారన్నారు. సమయపాలన, విలువలున్న నాయకుడని, ఛలోక్తులు, హాస్యంతో సాగే ఆయన ప్రసంగం ఎవరినైనా ఆకట్టుకుం టుందని పేర్కొన్నారు. 75 ఏళ్ల ఆయన జీవితంలో అనేక సేవలు అందించారని, స్వర్ణభారత్ ట్రస్ట్ ద్వారా గ్రామీణ ప్రాంత యువతకు నైపుణ్య శిక్షణ అందిస్తూ వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశా లను కల్పిస్తున్నారని తెలిపారు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా దత్తాత్రేయ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
వెంకయ్యనాయుడు మార్గనిర్దేశం నా అదృష్టం
క్రమశిక్షణ, చేసే పనిపట్ల స్పష్టత, అంకితభావం, చిత్తశుద్ధి ఉంటే ఏదైనా సాధించవచ్చు అనేందుకు వెంకయ్యనాయుడును మించిన ఉదాహరణ ఇంకొకటి ఉండదు. ఆయన నేతృత్వంలో పార్టీలో పనిచేయడం, ఆ తర్వాత సమయానుగుణంగా వారి మార్గదర్శనం పొందడం నా అదృష్టం. దాదాపు 5 దశాబ్దాల రాజకీయ జీవితంలో సిద్ధాంతిక వైరుధ్యత ఉన్నా.. ఎవరితోనూ వ్యక్తిగత విభేదాల్లేని అజాతశత్రువు ఆయన. సమయపాలన, మాతృభాష పట్ల, మాతృదేశం పట్ల, పుట్టిన ఊరు పట్ల వారికున్న మమకారం.. ప్రజలందరూ.. వీటిని పాటిస్తే విజయం సాధించడం ఖాయమన్న వారి ఆలోచనలు ఎప్పుడూ స్ఫూర్తిదాయకమే. ఆయన పుట్టినరోజు సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ.. నిండు నూరేళ్లూ వారికి ఆయురోరోగ్యాలు ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.
కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి జీ కిషన్ రెఢ్డి






