డ్రోన్లతో పోలింగ్ పర్యవేక్షణ
హైదరాబాద్‌లో ఎన్నికలకు సర్వం సిద్ధం
జోన్లవారీగా క్విక్ రెస్పాన్స్ టీంలు
స్ట్రాంగ్ రూంల వద్ద మూడంచెల భద్రత
4700 లైసెన్డ్స్ ఆయుధాలు స్వాధీనం
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 10 (విజయక్రాంతి) : జిల్లాలో ఈ నెల 13న జరుగనున్న రెండు పార్లమెంటు స్థానాలకు, కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఎన్నికలకు ఏర్పాట్లు చేసినట్టు జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్‌రాస్ తెలిపారు. జిల్లాలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షణ చేయనున్నట్టు తెలిపారు. ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై రోనాల్డ్ రోస్, నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి, హైదరాబాద్, సికింద్రాబాద్, కంటోన్మెంట్ ఆర్‌వోలు అనుదీప్ దురిశెట్టి, హేమంత్ కేశవ్ పాటిల్, మధుకర్ నాయక్‌తో కలిసి బేగంపేట టూరి జం ప్లాజాలో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. పోలింగ్ నిర్వహణకు మ్యాన్ పవర్, మెటీరియల్ ఏర్పాట్లు, ఈవీఎం కమిషనింగ్, పోలింగ్ ముందు జరగాల్సిన ప్రక్రియను వందశాతం పూర్తి చేశామని రొనాల్డ్‌రాస్ తెలిపారు. జిల్లాలో 3986 పోలింగ్ కేంద్రాలు ఉండగా, 1250 మైక్రో అబ్జర్వర్లను నియామకం చేశామని చెప్పారు. క్రిటికల్ పోలింగ్ కేంద్రాల బయట కూడా వెబ్ కాస్టింగ్ చేస్తామన్నారు. ఇప్పటి వరకూ 14,292మంది పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకున్నారని అన్నారు.
సి విజిల్ యాప్ ద్వారా వచ్చిన 339 ఫిర్యాదులను పరిష్కరించామని తెలిపారు. సాక్ష్యం యాప్ ద్వారా ఇప్పటి వరకు 311మంది దివ్యాంగులు ఓటు వేయడానికి ఫ్రీ పికప్, తిరిగి డ్రాపింగ్ కోసం దరఖాస్తు చేసుకున్నట్టు తెలిపారు. సీపీ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 383 సమస్యా త్మక, 663 ఏఎస్‌డి ప్రాంతాలు ఉన్నాయన్నారు. మొత్తం 376 రూట్లుగా పోలీస్ బందోబస్తు నిర్వహిస్తామన్నారు. 11 సాయం త్రం 6 గంటల నుంచి ప్రచార కార్యక్రమాలపై నిషేదం అమలులోకి వస్తోందన్నారు. మూడంచెల భద్రతకు సీఏపీఎఫ్ బలగాలు 25 కంపెనీలు వచ్చినట్టు తెలిపారు. నగరం లో మొత్తం 15 వేల పోలీసులు బందోబస్తులో పాల్గొంటారని అన్నారు. కర్నాటక నుంచి మరో 1000మంది హోంగార్డులు బందోబస్తుకు వస్తున్నారని అన్నారు. కమిషనరేట్ పరిధిలో లైసెన్స్ కలిగిన ఆయుధాలు ఇప్పటి వరకు 4700 డిపాజిట్ అయినట్టు తెలిపారు. మరో 761 ఆయుధాలు నిబంధనల ప్రకారం వారి వద్దే ఉన్నాయన్నారు. ఈవీఎం తరలింపులో కూడా ఆయుధాలు ధరించిన పోలీసులు నిర్వహించరాదని, కేవలం వారికి సహాయంగా మాత్రమే ఉండాలన్నారు.






