24 April, 2026 | 7:22 PM

రాజుకుంటున్న పోడు వివాదం

11-05-2024 02:58 AM

కాగజ్‌నగర్‌లో రైతుల ధర్నా.. తుంగెడలో తోపులాట

కుమ్రం భీం ఆసిఫాబాద్, మే 10 (విజయక్రాంతి): ఏళ్ల నుంచి తాము పోడు చేసుకుని జీవిస్తున్నామని, కానీ అటవీశాఖ అధికారులు తమను సాగు చేసుకునేందుకు అడ్డుపడుతున్నదని కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్‌నగర్ మండలం ఆరేగూడ, మోసం గ్రామాలకు చెందిన పోడు రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం కాగజ్‌నగర్‌లోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టి తమ డిమాండ్లను వినిపించారు. గత ప్రభుత్వం ఇచ్చిన పట్టాలను చూపించినా, అవి బోగస్ అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల తర్వాత జాయింట్ సర్వే చేపట్టి సమస్యను పరిష్కరిస్తామని తహసీల్లార్ కిరణ్‌కుమార్ హామీ ఇవ్వడంతో పోడు రైతులు ఆందోళనను విరమించారు. అలాగే రెబ్బెన మండలం తుంగెడ పంచాయతీ పరిధిలోని మాదవాయిగూడ రిజర్వ్ ఫారెస్ట్‌లో పోడు సాగును శుక్రవారం అటవీశాఖ అధికారులు అడ్డుకున్నారు. దీంతో పోడు రైతులు, అటవీశాఖ అధికారులకు మధ్య వాగ్వాదం జరిగింది. అది కాస్తా తోపులాటకు దారి తీసింది. పోడు రైతులు  కోపోద్రిక్తులై దాడులకు పాల్పడడంతో  ఆటవీశాఖ సిబ్బందికి గాయలయ్యాయి. రేంజర్ అప్పలకొండ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో డీఎస్సీ సదయ్య ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోడు రైతులకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటిరీ వారు వినలేదు. అటవీశాఖ అధికారులు ఫిర్యాదు మేరకు డీఎస్పీ పలువురు పోడు రైతులపై కేసులు నమోదు చేయిచినట్లు తెలుస్తున్నది.