2 April, 2026 | 1:31 PM

అంతా ట్రాక్ తప్పింది

06-05-2024 01:43 AM

వెయ్యి కోట్ల కంపెనీ చెన్నైకి వెళ్లిపోయింది

ఈ ప్రభుత్వం కొసెల్లా ఉండేలా లేదు

అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడొచ్చినా అధికారం బీఆర్‌ఎస్‌దే

బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కే చంద్రశేఖర్‌రావు

తెలంగాణ పునర్నిర్మాణం మిగిలే ఉందని వ్యాఖ్య

కరీంనగర్/ జగిత్యాల, మే ౫ (విజయక్రాంతి)/ హుజూరాబాద్: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే తెలంగాణ పరిస్థితి తారుమారైందని బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్రం నుంచి పెట్టుబడులు తరలిపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. రూ.౧౦౦౦ కోట్ల విలువైన కంపెనీ చెన్నైకి వెళ్లిపోయిందని తెలిపారు. నాలుగు నెలల్లోనే ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, కాంగ్రెస్ ప్రభుత్వం కొసెల్లా ఉండేలా లేదని అనుమానం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికలు వచ్చినా బీఆర్‌ఎస్‌దే అధికారమని ధీమా వ్యక్తంచేశారు.

కరీంనగర్ జిల్లా వీణవంకలోని ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి నివాసంలో ఆదివారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన కార్యకర్తల సభలో కేసీఆర్ ప్రసంగిస్తూ.. తెలంగాణ వచ్చాక పేద ప్రజల కోసం అనేక పథకాలు తీసుకొచ్చామని చెప్పారు. ప్రపంచంలో రైతుబంధు అనే పథకాన్ని మొట్టమొదటిసారి తెలంగాణలో ప్రవేశపెట్టామని, మళ్లీ అధికారంలోకి వస్తే రైతుబంధు మరో వెయ్యి పెంచుతామని ప్రకటించారు. దళితబంధు పథకంతో హుజూరాబాద్‌లో దళితులు సంపన్నులయ్యారని తెలిపారు.

కాంగ్రెస్ వల్లే ఇంతమంచి వ్యవస్థ ట్రాక్ తప్పిందని ఆరోపించారు. గోదావరి నీళ్లు కర్ణాటకకు ఇస్తామని కేంద్రం అంటున్నా సీఎం రేవంత్‌రెడ్డి చప్పుడు చేయడం లేదని విమర్శిం చారు. తెలంగాణలో మన ప్రభుత్వం లేనందుకు కేంద్రంలో మన ఎంపీలను గెలిపించుకుందామని బీఆర్‌ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. తన బస్సు యాత్రకు వచ్చిన ఆదరణ చూసి భయపడి 48 గంటలపాటు ప్రచారం ఆపి కుట్ర చేశారని ఆరోపించారు. తెలంగాణ హక్కుల కోసం పోరాడే బోయినపల్లి వినోద్‌కుమార్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

తోక తెల్వది.. తొండం తెల్వది 

సీఎం రేవంత్‌రెడ్డికి తోక తెల్వది..తొండం తెల్వదని కేసీఆర్ విమర్శించారు. ఆయన ఐదు నెలల్లోనే తెలంగాణను ఆగమాగం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి పరిపాలన చేతకావడం లేదని ధ్వజమె త్తారు. జగిత్యాలలో అదివారం నిర్వహించిన రోడ్ షోలో కేసీఆర్ మాట్లాడుతూ రైతుబంధును ఐదెకరాలకే పరిమితం చేస్తామంటు న్నరని.. మరి ఎనిమిదెకరాల రైతులు ఎక్కడికి పోవాలని ప్రశ్నించారు. ‘యాసంగి వడ్లన్నీ ఎక్కడికక్కడే కుప్పలు ఉన్నాయి. తులం బంగారం తుస్సుమన్నది’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. తొమ్మిదేళ్లు లేని కరెంటు కోతలు ఇప్పుడెందుకు వచ్చాయని నిలదీశారు.

కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏం రోగం వచ్చిందని ధ్వజమెత్తారు. మోదీ పాలనలో నిత్యావసరాల ధరలు అడ్డగోలుగా పెరిగాయని విమర్శించారు. ‘మోదీ పాలనలో అచ్చేదిన్ వచ్చిందా? సచ్చేదిన్ వచ్చిందా? అమృత్ కాల్ వచ్చిందా? బేటీ పడావో? బేటీ బచావో  వచ్చిందా? జన్‌ధన్ ఖాతాలో డబ్బులు పడ్డాయా?’ అని ప్రశ్నించారు. మోదీ ఏ ఒక్క వర్గానికి న్యాయం చేయలేదని విమర్శించారు. కార్యక్రమంలో నిజామాబాద్, పెద్దపల్లి, కరీంనగర్ బీఆర్‌ఎస్ అభ్యర్థులు బాజిరెడ్డి గోవర్దన్, కొప్పుల ఈశ్వర్, వినోద్‌కుమార్ పాల్గొన్నారు.

 కాంగ్రెస్ పాలన ఎలా ఉంది  

తొమ్మిదేళ్ల కారు పాలన చూశారు.. కాంగ్రెస్ పాలన చూస్తున్నారు.. అప్పుడు, ఇప్పుడు   ఎలాగుంది? అని ప్రజలను కేసీఆర్ ప్రశ్నించారు. కరీంనగర్ నుంచి జగిత్యాలకు వస్తూ మార్గమధ్యలో కొండగట్టులో ఆగి హోటల్‌లో ఆయన టీ తాగారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలను పలకరించించారు. అధికారంలోకి వచ్చేందుకు ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఏ ఒక్కటీ ఇప్పటికీవరకు నెరవేర్చిన దాఖలాలు కనిపించడం లేదని ప్రజలు బాధ పడుతున్నారని చెప్పారు. ఇప్పటికైనా ఆలోచించి ప్రశ్నించే గొంతుకకు అవకాశం ఇవ్వాలని కోరారు.