ఓటరు స్లిప్పుల పంపిణీ
జహీరాబాద్, మే 5 : పార్లమెంట్ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో సంబంధిత శాఖ అధికారులు ఏర్పాట్లను వేగవంతం చేస్తున్నారు. ఈ నెల 13న జరిగే పోలింగ్ జరగనుండగా బీఎల్వోలు ఇంటింటికీ తిరుగుతూ ఓటరు స్లిప్పులను పంపిణీ చేస్తున్నారు. ఈ ప్రక్రియను గత నెల 25వ తేదీ నుంచి ప్రారంభమై ఈ నెల 8వ తేదీ వరకు కొనసాగనుంది. జహీరాబాద్ నియోజకవర్గంలోని సంబంధిత అధికారులు, రెవెన్యూ అధికారుల పర్యవేక్షిస్తూ ఓటరు స్లిప్పుల పంపిణీని పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. గతంలో ఆయా పార్టీల అభ్యర్థులు నియోజకవర్గంలోని పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకుల ద్వారా చీటీలపై ఓటరు పేరు రాసి ఇంటింటా పంపిణీ చేసేవారు.
అప్పట్లో వాటిపై రాజకీయ పార్టీ పేరు, పార్టీ గుర్తులు ఉండేవి. ప్రస్తుతం ఈ విధానానికి ఎన్నికల కమిషన్ స్వస్తి పలికింది. పారదర్శకత దృష్టిలో పెట్టుకుని బూత్‌స్థాయి అధికారులు (బీఎల్వో) స్వయంగా ఓటర్ స్లిప్పులను ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేస్తున్నారు. ఓటరు స్లిప్పుల వెనుక భాగంలో పోలింగ్ కేంద్రానికి నేరుగా చేరుకునేందుకు గుగూల్ మ్యాప్ రూపొందించారు. ప్రతి ఒక్కరూ స్వేచ్ఛయుతంగా వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకోవాలని జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల సహాయధికారి, ఆర్డీవో రాజు సూచించారు. ఓటర్లు 12 గుర్తింపు కార్డులలో ఏదేని ఒక కార్డుతో వచ్చి ఓటు వేయాలని సూచించారు.




