బరాబర్ అంతే! మా అయ్య జాగీరే!
తెలంగాణపై మాటల తూటాలు
- మిస్టర్ పవన్ కల్యాణ్.. నవ నిర్మాణ సభ పేరుతో ఇక్కడ నీవు పీకేదేముంది
- తెలంగాణకు ఎప్పుడైనా మద్దతిచ్చావా?
- కొండగట్టుకు గెస్ట్‌గా వస్తే ప్రొటోకాల్ ఇచ్చాం
- పవన్‌తో బీజేపీ, బీఆర్‌ఎస్ మాట్లాడిస్తున్నట్లుగా ఉంది
- గద్దర్‌పై వ్యాఖ్యలా.. క్షమాపణలు చెప్పాలి
- పవన్ కళ్యాణ్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్
- పవన్‌వి డిప్రెషన్ మాటలు: అనిరుధ్ రెడ్డి
* మిస్టర్ పవన్ కళ్యాణ్.. తెలంగాణ బరాబర్ మా అయ్య జాగీరే. నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల జాగీరే.. నీ అయ్య జాగీరు కాదు.. ఈ ప్రాంతం మా తండ్రి, తాతల జాగీరే. పవన్ కళ్యాణ్ ఏపీలోనే ఏమీ పీకలేదు.. తెలంగాణ నవ నిర్మా ణం పేరుతో తెలంగాణలో పీకేదేముంది. పవన్ ఓ పెయిడ్ ఆర్టిస్ట్. నా దగ్గర డబ్బులు ఉంటే నేను కూడా ఆయనను ఓ పాత్రకు ఎంగే జ్ చేసేవాణ్ణి.
ఆయనకు వచ్చే చిట్టీలు బీజేపీ నుంచి వస్తున్నాయా, బీఆర్‌ఎస్ నుంచి వస్తున్నాయా తెలుస్తలేదు. ప్రేక్షకులు నటుడిని గౌరవిస్తూ ఈలలు కొడుతుంటే, అదంతా నా బలం అనుకుంటే ఏం చేస్తాం. పవన్ తెలంగాణకు రావడానికి, వెళ్లడానికి అభ్యంత రాలు లేవు. కానీ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజే గెలికి నవ నిర్మాణం పేరుతో సభ పెడుతామంటే చూస్తూ ఊరుకునేది లేదు.
మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్, జూన్ 2 (విజయక్రాంతి) : తెలంగాణ మీ అయ్య జాగీరా అంటూ జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. ‘మిస్టర్ పవన్ కల్యాణ్.. తెలంగాణ బరాబర్ మా అయ్య జాగీరే. నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల జాగిరే.. నీ అయ్య జాగిరి కాదు.. ఈ ప్రాంతం మా తండ్రి, తాతల జాగీరే’నని మంత్రి పొన్నం పేర్కొన్నారు.
గాంధీభవన్‌లో మంగళవారం పొన్నం మీడియాతో మాట్లాడుతూ, ఏపీలోనే తనకు దిక్కులేదని పవన్ కళ్యాణే స్వయంగా అంగీకరించారన్నారు. తెలుగు రాష్ట్రాలు ప్రాంతాలుగా విడిపోయి 12 ఏళ్లయినా ప్రజలుగా కలిసి ఉండాలని కోరుకున్నామన్నారు. పవన్ అక్కడనే ఏమీ పీకలేదు.. తెలంగాణ నవ నిర్మాణం పేరుతో పవన్ కల్యాణ్ తెలంగాణలో పీకేదేముందని మంత్రి పొన్నం ఘా టుగా వ్యాఖ్యనించారు.
ముందు తెలంగాణ ప్రజలకు పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. చనిపోయిన గద్దర్ గురించి మాట్లాడుతూ, నేను కారు కొనిచ్చా అని చెప్పాడని, తెలంగాణలో ఉన్న దళిత వర్గాలు ఆలోచన చేయాలన్నారు. పవన్ కొండగట్టు వస్తే తెలంగాణ గెస్ట్ గా ప్రొటోకాల్ ఇచ్చామని మంత్రి గుర్తుచేశారు.
మమ్మల్ని గెలికితే ఊరుకోం..
పవన్ కళ్యాణ్ తెలంగాణకు రావడానికి వెళ్లడానికి ఎలాంటి అభ్యంతరాలు లేవని, కానీ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజే గెలికి నవ నిర్మాణం పేరుతో సభ పెడుతామంటే చూస్తూ ఊరుకునేది లేదని మంత్రి పొన్నం హెచ్చరించారు. తెలంగాణ ప్రజలు ఆంధ్ర ప్రజలను ఎప్పుడూ స్వాగితిస్తారని, మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామన్నారు. పవన్ ఎప్పుడైనా తెలంగాణకు మద్దతు ఇచ్చారా..? తెలంగాణ అమరవీరులకు ఏనాడైనా అండ గా నిలిచారా..? అని మంత్రి పొన్నం ప్రశ్నించారు.
‘ఆంధ్రాలో దిక్కు లేదు.. గతంలో ఒక్క సీటు రాలేదు. డిపాజిట్ గల్లంతు అయింది .. ఇప్పుడు పొత్తులో బీజేపీ, టీడీపీతో కలిసి జనసేన పోటీ చేస్తే గెలిచారు. నాకు ఆంధ్రా లోనే దిక్కు లేదు పవన్ కళ్యా ణ్ ఇక్కడ ముఖ్యమంత్రి అవుతారా..?’ అని ఆయనే చెప్పారని మంత్రి ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ గుజరాత్ లో పార్టీ పెట్టుకుంటే తమకు అభ్యంతరం లేదన్నారు.
మేం అహంకారానికి వ్యతిరేకంగా పోరాడాం..
‘ మేము అహంకారానికి వ్యతిరేకంగా పోరాడం. మా మీద దురహంకారం, ఆదిపత్యం చెలాయించవద్దని కోరుకున్నాము. అదే ఆధిపత్యం తో పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. రాజకీయంగా ప్రజాస్వామ్యంలో భారతదేశంలో తెలంగాణ అంతర్భాగమే. అనేక సందర్భాల్లో తెలంగాణవాళ్లు ఆంధ్రకి వెళ్తారు.. ఆంధ్రవాళ్ళు తెలంగాణకు వస్తారు. హైదరాబాద్‌ను పాకిస్తాన్ ఇండియా అన్న ట్టు మాట్లాడుతున్నారు. పాస్ పోర్ట్ తీసుకోవాలా..? అని అంటున్న పవన్ మీ మైండ్ సెట్ మార్చుకోండి.
మీరు శాసనసభలో ఉన్నారు.. మీకు పార్లమెంట్ గురించి ఐడి యా లేదు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందినప్పుడు నేను ప్రత్యక్ష సాక్షి. మీకు తెలిసి మాట్లాడుతున్నారా..? తలుపులు వేసి తెలంగాణ బిల్లు తెచ్చుకున్నారని మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ తెలంగాణపై అక్కసు కక్కుతున్నారు. మరోపక్క తెలంగాణ మీద ప్రేమ ఉంది అంటున్నారు...
తెలంగాణకు మద్దతుగా ఎప్పుడైనా మాట్లాడారా..?. తెలంగాణ అమరవీరులు చనిపోతుంటే ఎప్పుడైనా సంఘీభావం తెలిపావా..? మీరు ధైర్యంగా ఉండండి పోరాడి తెలంగాణ తెచ్చుకోండి అని చెప్పావా..? అవహేళన చేశావు.. తెలంగాణ ఏర్పడితే 11 రోజులు అన్నం తినలేదు అని చెప్పిన వాడివి. తెలంగాణ ఏర్పా టును అవమానించిన వ్యక్తివి..మీరు మాట్లాడితే ఎట్లా..? రాజకీయంగా వక్ర భాష చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ’ అని పొన్నం మండిపడ్డారు.
పవన్ కళ్యాణ్ ఒక పెయిడ్ ఆర్టిస్ట్..
‘పవన్ కళ్యాణ్ పెయిడ్ ఆర్టిస్ట్. నా దగ్గర డబ్బులు ఉంటే నేను కూడా ఆయనకు పాత్రకు ఎంగేజ్ చేసి మాట్లాడించే అవకాశం ఉండేది. ఆయనకు వచ్చే చిట్టీలు బీజేపీ నుంచి వస్తున్నాయా, బీఆర్‌ఎస్ నుంచి వస్తున్నాయా తెలుస్తలేదు. చంద్రబాబు నాయు డు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకునే వాతావరణం కలుగజేస్తున్నాం. 2009, 2014 ఎన్నికలప్పుడు తిరిగితే జనం వస్తుండొచ్చు.
ప్రేక్షకులు నటుడిని గౌరవిస్తూ ఈలలు కొడుతుంటే అదంతా నా బలం అనుకుంటే ఏం చేస్తాం. రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ విగ్రహాల ప్రస్తావన తేవడా నికి ఎంత ధైర్యం ’ అని మంత్రి హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ తెలంగాణలో తిరుగు తుంటే ఎవరు వద్దన్నారన్నారు. తెలంగాణలో ఆంధ్రావాళ్లకి పనిలేదని మేము అన డం లేదన్నారు. ఇది ఫెడరల్ సిస్టమని, హై దరాబాద్‌లో అన్ని భాషల వాళ్ళు ఉన్నారని ఆయన పేర్కొన్నారు.
గుజరాత్‌లో పోటీ చేయాలి: ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తీవ్ర విమర్శలు. ’ఓజీ’, ’ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలు ఫ్లాప్ అయిన డిప్రెషన్‌లోనే పవన్ మాట్లాడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ వైఖరిని తప్పుబడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్‌కు అమిత్‌షాపై అంతగా ప్రేముంటే వెళ్లి గుజరాత్‌లో పోటీ చేయాలి అంటూ ఎద్దేవా చేశారు.
పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం అయినప్పటినుంచి హైదరాబాద్‌లో ఎన్ని రోజులు ఉంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్ని రోజులు గడుపుతున్నారో సమాధానం చెప్పాలి అని అనిరుధ్‌రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణను ఉద్దేశించి ‘ నరదిష్టి’ అని పవన్ మాట్లాడటం వెనుక ఇలాంటి కారణాలే ఉండి ఉంటాయన్నారు.
ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ వచ్చినప్పుడు పవన్‌ను అమరావతిలో కలిశారా..? లేక హైదరాబాద్‌లో కలిశారా..? అని ప్రశ్నించారు. తిరుపతికి వెళ్లి హుండీలో వేసిన డబ్బుల గురించి కూడా ఎవరైనా గొప్పగా చెప్పుకుంటారా..? అని అనిరుధ్‌రెడ్డి మండిపడ్డారు. ప్రొడ్యూసర్లు ఎవరు ఎక్కువ ప్యాకేజీ ఇస్తే వాళ్ల దగ్గరికే పవన్ కళ్యాణ్ వెళ్తారని ఆరోపించారు.






