11 July, 2026 | 10:37 PM

ఆ పాత్ర చేయడం నాకెప్పుడూ ప్రత్యేకమే

14-12-2024 12:00 AM

రాణి ముఖర్జీ ప్రధాన పాత్రలో యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై రూపొందిన ‘మర్దానీ’ చిత్రం మంచి విజయం సాధించింది. ఈ సినిమా విడుదలై 10 ఏళ్లు అవుతుంది. 2014లో ఈ చిత్రం విడుదలైంది. 2019లో దీనికి సీక్వెల్‌ను రూపొందించారు. ఈ రెండు చిత్రాలు సూపర్ హిట్ చిత్రాలుగా బాక్సాఫీస్ దగ్గర రాణించాయి. గురువారం ‘మర్దానీ 2’ రిలీజ్ యానివర్సరీ సందర్భంగా ‘మర్దానీ 3’కి సంబంధించిన మేకింగ్ వీడియోను యష్‌రాజ్ ఫిల్మ్స్ విడుదల చేసింది. ఇందులో రాణి ముఖర్జీ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ శివానీ శివాజీ రాయ్ పాత్రలో నటించారు. ఈ సందర్భంగా రాణి ముఖర్జీ మాట్లాడుతూ “2025 ఏప్రిల్ నుంచి ‘మర్దానీ 3’ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ను ప్రారంభించబోతున్నామని తెలియజేయటానికి ఎంతో సంతోషంగా ఉంది. పోలీస్ డ్రెస్ వేసుకుని ఓ అద్భుతమైన పాత్రను చేయటం నాకెప్పుడూ ప్రత్యేకమనే చెప్పాలి. మనల్ని కంటికి రెప్పలా కాపాడుతూ, డ్యూటీలో ప్రాణ త్యాగానికి సైతం వెనుకాడని ధైర్యవంతులైన పోలీస్ ఆఫీసర్స్‌కి ఈ సినిమా అంకితం” అన్నారు. యష్ రాజ్ ఫిల్మ్స్‌కు సంబంధించిన అభిరాజ్ మినవాలా, ‘మర్దానీ 3’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.