25 July, 2026 | 2:34 AM

మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా

25-07-2026 01:19 AM

మెదక్ జిల్లా ఎస్పీ డీవీ. శ్రీనివాసరావు

మెదక్, జులై 24 (విజయక్రాంతి): మెదక్ జిల్లాలో ఇటీవల విధి నిర్వహణలో రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన హోంగార్డు ఎం. శివరాం, గుండెపోటుతో మృతిచెందిన హోంగార్డు టీ. మహేందర్ కుటుంబాలకు ప్రభుత్వం మంజూరు చేసిన రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా చెక్కులను జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు అందజేశారు.

జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మృతుల కుటుంబ సభ్యులకు ఎస్పీ చెక్కులను అందించారు. అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడిన ఎస్పీ వారి ఆర్థిక పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. మృతుడు శివరాం కుటుంబ పరిస్థితిని తెలుసుకున్న ఎస్పీ.. ఆయన పిల్లల చదువుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. బీటెక్ పూర్తి చేసిన శివరాం కుమారుడు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న విషయం తెలుసుకుని, అతని విద్యార్హతలు, ఇతర వివరాలను సేకరించారు. ఉద్యోగం కల్పించే విషయంలో తనవంతు సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు.

అలాగే మహేందర్ భార్య ప్రస్తుతం ఎలాంటి ఉపాధి లేక ఇంటివద్దే ఉంటున్న విషయం తెలుసుకున్న ఎస్పీ.. ఆమె విద్యార్హతలు, ఉద్యోగ అవకాశాల గురించి ఆరా తీశారు. ఆమెకు ఉద్యోగం కల్పించేందుకు తనవంతు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. మృతుల కుటుంబాలకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎస్పీ తెలిపారు. కుటుంబ సభ్యుల సంక్షేమానికి అవసరమైన సహకారం అందించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, ఆర్‌ఐ శైలేందర్, ఆర్‌ఎస్‌ఐ నరేష్, రైటర్ శ్రావణ్, మృతుల కుటుంబ సభ్యులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.