25 July, 2026 | 2:35 AM

ధర్నాచౌక్‌కు కదిలిన పటాన్‌చెరు యువతరం

25-07-2026 01:20 AM

ఎమ్మెల్యే జీఎంఆర్ నేతృత్వంలో 300కు పైగా వాహనాలతో భారీ ర్యాలీ

పటాన్ చెరు, జూలై 24: కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతూ.. ప్రశ్నించిన వారిపై దమనకాండ  కొనసాగిస్తోందని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ భవిష్యత్తు కోసం పోరాటం చేస్తున్న విద్యార్థి లోకానికి బిఆర్‌ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆయన తెలిపారు.

దేశ రాజధాని ఢిల్లీలో విద్యార్థులు, యువతపై కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న దమనకాండకు వ్యతిరేకంగా శుక్రవారం భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని ధర్నా చౌక్ లో చేపట్టిన నిరసన కార్యక్రమానికి పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో వందలాదిమంది విద్యార్థులు, యువకులు ద్విచక్ర వాహనాలు, 300 పైగా కార్లలో ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. పటాన్చెరు డివిజన్ పరిధిలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్ వద్ద జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం విద్యారంగాన్ని బ్రష్టు పట్టిస్తోందని విమర్శించారు.

గత 12 సంవత్సరాల ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో 158 పరీక్షల ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయని పేర్కొన్నారు. నీట్ వంటి కీలకమైన జాతీయ స్థాయి పరీక్షల ప్రశ్నాపత్రాలు లీక్ కావడం మూలంగా లక్షలాది మంది విద్యార్థుల జీవితాలు అగమ్యగోచరంగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పనితీరులో పారదర్శకత కరువైందని.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ పార్టీ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు, యువత, విద్యార్థి విభాగం కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.