25 July, 2026 | 4:33 AM

ఎగ్జిట్ పోల్స్‌కు ఎలాంటి విలువ లేదు

04-06-2024 03:08 AM

కోల్‌కతా, జూన్ 3 : ఆదివారం విడుదలైన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వూలో ఆమె మాట్లాడుతూ.. ఎగ్జిట్ పోల్స్‌కు ఎలాంటి విలువ లేదని, రెండు నెలల ముందుగానే ఇంట్లో కూర్చొని బీజేపీకి అనుకూలంగా తయారు చేశారని విమర్శించారు. ఈ ఎగ్జిట్ పోల్స్‌ను నమ్మేది లేదని, వాటిని బహిష్కరిస్తున్నామని ప్రకటించారు.

ఈ మోసపూరిత వ్యూహాలకు లొంగకుండా పార్టీ కార్యకర్తలు మానసికంగా బలంగా ఉండాలని కోరారు. కాగా, ఆదివారం విడుదలైన ఎగ్జిట్ పోల్స్ పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ కన్నా బీజేపీకి ఎక్కువ స్థానాలు వస్తాయని స్పష్టం చేశాయి. ఇండి యా టుడే సర్వే పశ్చిమ బెంగాల్‌లో బీజేపీకి 26 సీట్లు, కాంగ్రెస్‌కు 11 సీట్ల మధ్య వస్తాయని అంచనా వేసింది. ఈ నేపథ్యంలోనే మమతా బెనర్జీ ఈ వ్యాఖ్యలు చేశారు.

“2016, 2019, 2021లో ఎగ్జిట్ పోల్స్ ఎలా నిర్వహించారో మేం చూశాం. అంచనాలు ఏవీ నిజం కాలేదు. ముస్లింలు.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల కోటా లాగేసుకుంటారని బీజేపీ ప్రచారం చేసింది. ఈ నేపథ్యంలో ముస్లింలు బీజేపీకి ఓటు వేస్తారని నేను అనుకోవడం లేదు. పశ్చిమ బెంగాల్‌లో సీపీఐ (ఎం), కాంగ్రెస్ బీజేపీకి సహాయం చేశాయని భావిస్తున్నాను” అని వ్యాఖ్యానించారు.