అదో పెద్ద జోక్..
పిన్నెల్లికి బెయిల్ ఇవ్వడంపై సుప్రీం సీరియస్
న్యూఢిల్లీ, జూన్ 3: ఏపీలో ఎన్నికల సందర్భంగా పోలింగ్ బూత్‌లో వీవీప్యాట్ మెషీన్‌ను పగులగొట్టిన వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంపై సుప్రీం కోర్టు సీరియస్ అయింది. పిన్నెల్లికి బెయిల్ ఇవ్వడం వ్యవస్థను అపహాస్యం చేసినట్టే అని సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇలాంటి కేసుల్లో కోర్టులు బెయిల్ ఎలా ఇస్తాయంటూ అసహనం వ్యక్తం చేసింది. తాము కనుక స్టే ఆర్డర్ ఇవ్వకపోతే వ్యవస్థ మొత్తం నాశనం అయ్యే పరిస్థితి తలెత్తుతుందంటూ తీవ్రంగా దుయ్యబట్టింది. ‘ఏమైనా కామెడీ చేస్తున్నామా? ఇదో పెద్ద జోక్ అయిపోయిది. ఓ పోలింగ్ బూత్‌లోకి అంతమంది ఎలా ప్రవేశించారు?’ అంటూ సుప్రీం కోర్టు మండిపడింది. మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.






