అధికారం ఉన్నా.. లేకున్నా.. ప్రజల పక్షాన పోరాడుతాం
మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్
హనుమకొండ, జూన్ 7 (విజయక్రాంతి): భారత రాష్ట్ర సమితి పార్టీ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ 4వ డివిజన్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, మాజీ శాసనసభ్యులు దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజా జీవితంలో, ప్రజా క్షేత్రంలో ఉన్నామన్నారు.
అధికార కాంగ్రెస్ తాటాకు చప్పుళ్లకు భయపడమని, కుట్రపూరితంగా కేసుల పాలు చేసిన నికార సేన బిఆర్‌ఎస్ కార్యకర్తలు బెదరకుండా, 30 ఏండ్ల ప్రజా జీవితంలో కక్షపూరిత రాజకీయాలు చేయలేదన్నారు. మాజీ కార్పొరేటర్ బొంగు అశోక్ పై కుట్రపూరితంగా కేసులు పెట్టి జైలు పాలు చేసిన భరించామన్నారు. గతంలో పార్టీలు, మత, కుల బేధాలు చూడకుండా అందరికి సంక్షేమ పథకాలు అందించామని,కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, సీపీఐ, సీపీఎం పార్టీ వాళ్లకు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అందించాం అన్నారు.
4వ డివిజన్ పరిధిలో 55 కోట్ల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చెప్పుకోక పోవడం వల్ల ఇటీవల ఎన్నికల్లో ఓటమి ఎదురైందన్నారు. పార్టీ కి ప్రస్తుతం అండగా ఉన్నవారిని కాపాడుకుంటామని, గులాబీ జెండా అండగా ఉంటుందని, పదవులు, పైసలు లబ్ధి పొందిన వారు పార్టీలు మారొచ్చు అయినా ఇప్పుడు నిబద్ధత కలిగిన నాయకులు ఉన్నారని, అన్ని వర్గాల ప్రజల పక్షాన పోరాడుతాం, కాంగ్రెస్ మోసాలను ప్రజా క్షేత్రంలో ఎండగడుదాం అన్నారు.
అనంతరం తాజా మాజీ కార్పొరేటర్ బొంగు అశోక్ యాదవ్ ని సన్మానించారు. కాలనీ అభివృద్ధి కోసం డివిజన్ మాజీ అధ్యక్షులు డా. కంజర్ల మనోజ్ కుమార్ రూపొందించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు కుసుమ లక్ష్మీ నారాయణ, జోరిక రమేష్, డివిజన్ ఇంచార్జ్ ప్రదీప్ రెడ్డి, నాయకులు డా. కంజర్ల మనోజ్ కుమార్, ఇస్మాయిల్, పార్వతి, దశరథ్, బైరపాక ప్రశాంత్, సారిక, శ్యామ్ సుందర్ రెడ్డి, బూత్ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.






