రాష్ట్రంలో రెండు హైవేల విస్తరణ
- కేంద్ర క్యాబినెట్ ఆమోదం
- ఆర్మూర్- జగిత్యాల -కరీంనగర్ జాతీయ రహదారుల విస్తరణకు గ్రీన్ సిగ్నల్
- 190 కి.మీ మేర నాలుగు వరుసలతో నిర్మాణం
హైదరాబాద్, జూన్ 3 (విజయక్రాంతి): తెలంగాణ పారిశ్రామిక, రవా ణా రంగాల అభివృద్ధికి ఊతమిచ్చేలా కేంద్ర ప్రభుత్వం భారీ రహదారి ప్రాజెక్టులను ప్రకటించింది. రాష్ట్రంలోని నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, కరీంనగర్ జిల్లాల మీదుగా వెళ్లే మొత్తం 190.76 కిలోమీటర్ల పొడవైన రెండు ముఖ్యమైన జాతీయ రహదారుల విస్తరణకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
ఈ ప్రాజెక్టును మొత్తం మూడు వర్క్ ప్యాకేజీలుగా విభజించారు. ప్రస్తుతం ఈ మార్గాల్లో విపరీతమైన ట్రాఫిక్ జామ్స్ అవుతుండటంతో, గంటకు వంద కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా, జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో బైపాస్ రోడ్లు, ఓపెన్ టోలింగ్ విధానంతో ఈ సరికొత్త నాలుగు -లేన్ల హైవేలను నిర్మించనున్నారు.
ఈ కారిడార్ల నిర్మాణం పూర్తయితే ప్రయాణికులకు, సరుకు రవాణా వాహనాలకు పెద్ద ఉపశమనం లభించనుంది. ఆర్మూర్- జగిత్యాల- మంచిర్యాల హైవే (ఎన్‌హెచ్ 63) విస్తరణకు ఆమోదం తెలిపింది. హైబ్రిడ్ యాన్యూటీ విధానంలో విస్తరణకు అంగీకారం తెలిపింది. జగిత్యాల- జాతీయ రహదారి (ఎన్‌హెచ్ 563) విస్తరణకు కూడా క్యాబినెట్ ఆమోదం లభించింది. ఈ జాతీయ రహదారిని బీవోటీ పద్ధతిలో నిర్మించనున్నారు. ఇందుకోసం రూ.7,597 కోట్లు ఖర్చుచేయనున్నారు.






