సామాజిక శ్రమ దోపిడీ
మన దేశ ఆర్థిక వ్యవస్థను నిజంగా నిలబెడుతున్నది శ్రమజీవులే. వ్యవసాయ కూలీలు, నిర్మాణరంగ కార్మికులు, ఆటోడ్రైవర్లు, కులవృత్తులవారు.. ఇలా కోట్లాది మంది అసంఘటిత రంగ కార్మికుల శ్రమపైనే దేశ ఆర్థిక నిర్మాణం నిలబడి ఉంది. కానీ, ఈ వర్గాలకే అత్యల్ప వేతనాలు, అస్థిర జీవితం, హక్కుల లేమి, సామాజిక అవమానం దక్కుతున్నాయి. వీరిలో అత్యధికులు దళిత, బీసీ, ఆదివాసీ, మైనారిటీ బహుజన వర్గాలకు చెందినవారే కావడం భారతదేశ సామాజిక నిర్మాణంలోని వైరుధ్యాన్ని బయటపెడుతోంది.
ప్రపంచ కార్మిక తత్వవాది ఒకరు చెప్పినట్లుగా, వేతనాలు సహజసిద్ధంగా నిర్ణయించిన స్థిరమైన పరిమాణం కావు, అవి సమాజంలోని శక్తి సంబంధాలపై ఆధారపడుతాయి. మన దేశంలో ఈ శక్తి సంబంధాలు కేవలం ఆర్థిక సంబంధాలు కావు; అవి కులాధిపత్యంతో బలంగా ముడిపడి ఉన్నాయి. శ్రమ దోపిడీ అంటే పెట్టుబడిదారీ దోపిడీ మాత్రమే కాదు; అది కులాధిపత్యం ద్వారా మరింత బలపడిన సామాజిక, -ఆర్థిక దోపిడీ కూడా.
చారిత్రకంగా శ్రమ చేసే వర్గాలను శూద్రులుగా గుర్తించి, వారికి శ్రమే ధర్మమని, ఫలాన్ని ఆశించడం అధర్మమని చెప్పిన భావజాలం ఈ దేశంలో శతాబ్దాలుగా ఆధిపత్యం చెలాయించింది. పని చేయి కానీ, ఫలాన్ని ఆశించవద్దనే పాత భావజాలం, నేడు కొత్త ఆర్థిక రూపంలో కొనసాగుతోంది. గతంలో శ్రమజీవులకు విద్య, భూమి, ఆస్తి, అధికారాన్ని దూరం చేసిన విధంగానే, ఇప్పుడు సంఘటిత కార్మిక శక్తిని బలహీనపరిచి అసంఘటిత కార్మిక వ్యవస్థను విస్తరింపజేస్తున్నారు.
కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్, యాప్ ఆధారిత ఉపాధి, తాత్కాలిక ఉద్యోగాలు ఇవన్నీ కార్మికుల ఐక్యతను బలహీనపరిచే ఆధునిక పద్ధతులు. ఒక సంఘటిత కార్మికుడు తన హక్కుల కోసం పోరాడగలడు; కానీ అసంఘటిత కార్మికుడు ఉపాధి పోతుందనే భయంతో మౌనంగా ఉండాల్సి వస్తోంది. కనీస వేతనం, ఉద్యోగ భద్రత లేకుండా, కార్మిక చట్టాల రక్షణ లేకుండా కోట్లాది మంది పని చేస్తున్నారు.
శ్రమజీవి వర్గాలు ప్రశ్నించకుండా పని చేయాలి, తమ హక్కులను ప్రకటించకూడదు, ఆధిపత్య వర్గాల ఆదేశాలను మాత్రమే అనుసరించాలనే భావజా లం మన సమాజంలోనూ బలంగా నాటుకుపోయింది. నేడు అదే భావజాలం ఆధునిక పెట్టుబడిదారీ వ్యవస్థతో కలసి అసంఘటిత కార్మిక వ్యవస్థను మరింత విస్తరింపజేస్తోంది. నేడు కూలీలకు ఎక్కువ వేతనం ఇస్తే పరిశ్రమలు నష్టపోతాయి, హక్కులు పెరిగితే ఆర్థిక వ్యవస్థ కూలిపోతుందనే వాదనలు మళ్లీ వినిపిస్తున్నాయి.
కానీ, శ్రమజీవులకు న్యాయమైన వేతనాలు, భద్రత, పని గంటల నియంత్రణ, ఆరోగ్య హక్కులు కల్పించినప్పుడల్లా సమాజం కూలిపోలేదని చరిత్ర చెబుతున్నది. బదులుగా అంతర్గత మార్కెట్ బలపడింది, కొనుగోలు శక్తి పెరిగింది, ఉత్పత్తి వ్యవస్థ మరింత స్థిరపడింది. అసలు సంపదను సృష్టిస్తున్న వర్గాలే కనీస జీవన భద్రత లేకుండా బతకాల్సి రావడం ఏ సమాజానికైనా తీవ్రమైన అన్యాయం. ఒక నిర్మాణ కార్మికుడు కట్టిన భవనంలో నివసించే హక్కు అతనికి ఉండదు.
ఆహారం పండించిన వ్యవసాయ కూలీకి పోషకాహారం దొరకదు. పరిశుభ్రతను కాపాడే కార్మికుడే మురికివాడలో జీవించాల్సి వస్తుంది. దేశ సంపదను సృష్టించే వర్గాలే అత్యంత అసురక్షిత జీవితాన్ని గడపడం మన సామాజిక-, ఆర్థిక వ్యవస్థలోని అత్యంత క్రూరమైన వైరుధ్యం. ఈ వైరుధ్యాలకు కారణం మార్కెట్ వ్యవస్థ మాత్రమే కాదు; శ్రమను తక్కువగా చూసిన కులాధిపత్య సామాజిక నిర్మాణం కూడా.
అందువల్ల అసంఘటిత, వలస కార్మికుల పోరాటం వేతనాల పెరుగుదల కోసమే కాదు; అది గౌరవప్రదమైన జీవితం, శ్రమకు విలువ, సామాజిక న్యాయం కోసం, కులాధిపత్య- పెట్టుబడిదారీ దోపిడీ నిర్మాణానికి వ్యతిరేకంగా జరిగే పోరాటం కూడా. కనీస వేతనం, ఎనిమిది గంటల పని విధానం, సామాజిక భద్రత, కార్మిక సంఘ హక్కులు, వలస కార్మికుల రక్షణ, అసంఘటిత రంగ కార్మికులకు చట్టబద్ధ హక్కులు ఇవన్నీ శ్రమజీవి వర్గాల ప్రాథమిక హక్కులుగా గుర్తించాల్సిన అవసరం ఉంది.
ఈ దేశాన్ని నిజంగా నిర్మిస్తున్న శ్రమజీవి బహుజనవర్గాలు సంఘటితమై తమ హక్కుల కోసం నిలబడినప్పుడే సమానత్వం, సామాజిక న్యాయం, ఆర్థిక ప్రజాస్వామ్యం సాధ్య మవుతాయి. శ్రమకు గౌరవం లేని సమాజం ఎప్పటికీ న్యాయమైన సమాజంగా మారదు.
పీ వెంకటేష్ గౌడ్






