రోడ్లపైకి జెన్ జీ!
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శనివారం ఒక మహత్తర ఘట్టం ఆవిష్కృతమైంది. సోషల్ మీడియా వేదికగా కాక్రోచ్ జనతా పార్టీ పేరిట జెన్ జీ యువతరంలో పురుడుపోసుకున్న ‘డిజిటల్ నిరసన భావన’ క్షేత్రస్థాయిని బలంగా తాకింది. మన దేశ విద్యావ్యవస్థలోని లోపాలు, వరుసగా జరుగుతున్న పేపర్ లీకులకు వ్యతిరేకంగా జరిగిన ఈ శాంతియుత ఆందోళనను ఒక సాధారణ నిరసనగా మాత్రమే చూడలేం.
యువతలో పెరుగుతున్న అసంతృప్తికి ఇది ప్రతిబింబమని చెప్పక తప్పదు. ఇప్పటివరకు సోషల్ మీడియాకే పరిమితమైన ఈ వ్యంగ్య ఉద్యమం మొదటిసారిగా కార్యరంగంలోకి దిగడం ద్వారా ఒక కొత్త దశలోకి అడుగుపెట్టింది. మండుటెండల్లో రోజంతా కొనసాగిన ఈ నిరసన కార్యక్రమానికి సోనమ్ వాంగ్‌చుక్ లాంటి విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు కూడా మద్దతు తెలపడం ముదావహం. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో జెన్ జీ ఉద్యమాలు జరుగుతున్న విషయం తెలిసిందే.
ముఖ్యంగా నిరుద్యోగం, అవినీతి, పాలకుల ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, వ్యవస్థపై అసంతృప్తులు ఈ ఉద్యమాల వెనుక ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. భారత్‌లోనూ విద్యార్థులతో ప్రత్యక్షంగా ముడిపడి ఉన్న పేపర్ లీకుల అంశమే జెన్ జీ యువతరాన్ని రోడ్లపైకి తీసుకురావడం విశేషం. ఈ నిరసనలకు తలొగ్గి కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేస్తే, అది జెన్ జీ యువతరం సాధించిన తొలి విజయం అవుతుంది.
అదే జరిగితే యువతరానికి అదొక ఉత్ప్రేరకంలాగా పని చేస్తుంద నడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే, ఇక్కడితోనే ఆగిపోకుండా మొత్తం విద్యావ్యవస్థలో మార్పు కోసం యువత ఉద్యమించాల్సిన అవసరం ఉంది. ప్రశ్నాపత్రాల లీకులను అరికట్టడం, పరీక్షల నిర్వహణలో పారదర్శకతవంటి కీలక అంశాలపై ఇకపై దృష్టిపెట్టాలి. సమస్యను ఎత్తిచూపడమే కాదు, సరైన పరిష్కారమూ చూపించినప్పుడే జెన్ జీ ఉద్యమానికి సార్థకత చేకూరుతుంది.
విద్యా సమస్యలతో ప్రారంభమైన ఈ ఉద్యమం క్రమంగా యువతను ప్రభావితం చేస్తున్న నిరుద్యోగం, నియామకాల్లో జాప్యం, విద్యాసంస్థల దుస్థితి, అవినీతి, జీవన వ్యయాల పెరుగుదల వంటి అంశాలకు విస్తరించాలి. ఈ క్రమంలో అన్ని సమస్యలను ఒకేసారి తలకెత్తుకోకుండా స్పష్టమైన లక్ష్యం, కార్యాచరణతో ముందుకుసాగాలి. జంతర్ మంతర్ ధర్నా ద్వారా యువత తమ ఆవేదనను దేశానికి వినిపించింది. ఇప్పుడు ఆ స్వరం తాత్కాలిక నిరసనగా మిగిలిపోతుందా, లేక దేశ భవిష్యత్తును ప్రభావితం చేసే ప్రజా ఉద్యమంగా మారుతుందా? అన్నది చూడాలి.






