18-01-2026 12:06:19 AM
ఇంట్లో సామాన్లు చెల్లాచెదురు
తప్పిన ప్రాణాపాయం
జూబ్లీహిల్స్, జనవరి 17 (విజయక్రాంతి): వాషింగ్ మెషిన్ పేలిన సంఘటన మధురానగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది.సీఐ హెచ్.ప్రభాకర్ తెలిపిన వివరాల ప్రకారం ఓ మీడియా సంస్థలో పని చేస్తున్న సాంబశివ రెడ్డి (30) యూసుఫ్ గూడ డివిజన్ పరిధిలోని కృష్ణానగర్ లో ఉన్న సయ్యద్ గౌస్ హౌజ్ రెండో అంతస్తులో నివాసం ఉంటున్నారు. శనివారం ఉదయం 7.30 గంటల ప్రాంతంలో తన వద్దనున్న టాప్ లోడ్ బట్టలుతికే యంత్రంలో బట్టలను వేశాడు. అయితే కొంత సేపటికి పెద్ద శబ్దంతో అది పేలింది. దీంతో సాంబశివరెడ్డితో పాటు కుటుంబ సభ్యులు, ఇరు గుపొరుగు వారు ఉలిక్కిపడ్డారు. పేలుడు ధాటికి ఇంట్లోని సామాన్లు చెల్లాచెదురు అయ్యాయి.
ఆ సమయానికి అక్కడ ఎవ్వరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. దీనిపై బాధితుడు సాంబశివ రెడ్డి మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.తన టాప్ లోడ్ వాషింగ్ మెషీన్ ను ఉపయోగిస్తున్నప్పుడు మోటారు వైఫల్యం కారణంగా అకస్మాత్తుగా అసాధారణ శబ్దం రావడం ప్రారంభమైందని,దాని ఫలితంగా వాషింగ్ ఏరియాలో షార్ట్ సర్క్యూట్ సంభవించిందని. మంటలు చెలరేగాయని తన ఫిర్యాదు లో పేర్కొన్నారు. ఈ సంఘటనలో ఎవరికి ఏమీ కాలేదని తెలిపారు.బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని సీఐ ప్రభాకర్ వెల్లడించారు.అయితే సమీపంలోనే జైన మందిరం ఉండడంతో కాసేపు స్థానికంగా కలకలం రేగింది.ఎటువంటి ప్రమాదం లేదని తెలిసిన తరువాత సాధారణంగా అయ్యిందని నివాసితులు చెప్పారు.