డిజిటలైజేషన్ గడువు పెంచండి
ప్రభుత్వానికి టీజీహెచ్‌ఎంఏ విజ్ఞప్తి
హైదరాబాద్, మే 24 (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల సర్వీస్ రిజిస్టర్ల డిజిటలైజేషన్ గడువును ఈనెల 31నుంచి జూన్ 30వ తేదీ వరకు పొడిగించాలని తెలంగాణ గెజిటెడ్ హెడ్‌మాస్టర్ల సంఘం (టీజీహెచ్‌ఎంఏ) రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి.రాజభాను చంద్రప్రకాష్, ముఖ్య సలహాదారు డా.పర్వతి సత్యనారాయణ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
ప్రస్తుతం ఉపాధ్యాయుల సర్వీస్ రిజిస్టర్లలో నియామకాలు, ప్రొబేషన్, పదోన్నతులు, బదిలీలు, సెలవుల మంజూరు, వేతన సవరణలు, వార్షిక ఇంక్రిమెంట్లు తదితర అంశాలకు సంబంధించిన అనేక నమోదులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని పరిశీలించి, నవీకరించి, ధృవీకరించడం అవసరమని తెలిపారు. దీనికి తోడు రాష్ట్రవ్యాప్తంగా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు జనాభా గణనలో నిమగ్నమై ఉన్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో నిర్దేశించిన గడువులో డిజిటలైజేషన్ పూర్తి చేయడం కష్టసాధ్యమవుతుందని, జూన్ 30 వరకు గడువును పొడిగించాలని వారు విజ్ఞప్తి చేశారు.






