11 July, 2026 | 2:44 AM

రైతు ఆశీర్వాద సభ విజయవంతం

11-07-2026 01:44 AM

రెండు లక్షల మందికి పైగా ప్రజలు హాజరు

కిక్కిరిసిన జగన్నాథపురం రహదారులు

కాంగ్రెస్ కార్యకర్తల్లో నయా జోష్ నింపిన ఆశీర్వాద సభ

మధిర, చింతకాని, ఖమ్మం టౌన్, జులై 10(విజయక్రాంతి): ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం జగన్నాధపురంలో జరిగిన రైతు ఆశీర్వాద సభ విజయవంతం కావడంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. గత నెల 30న జరగాల్సిన ఈ సభ వాతావరణ పరిస్థితుల వల్ల వాయిదా పడింది.

రైతులకు పెట్టుబడి భరోసా కల్పించాలన్న ప్రభుత్వ ఉద్దేశానికి వరుణదేవుడు మద్దతు పలుకుతున్నట్లుగా విస్తారంగా వర్షాలు కురిసాయి. దీంతో రైతులకు ఇవ్వాల్సిన పెట్టుబడి రైతు భరోసాని ఆపకుండా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వేసింది. తొమ్మిది రోజుల్లోనే తొమ్మిది వేల కోట్ల రూపాయలను రైతు భరోసా కింద ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నున్న అన్నదాతలు హర్షాతిరేకల్లో మునిగిపోయారు.

ఈ నేపథ్యంలో ప్రభుత్వం శుక్రవారం మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలం జగన్నాధపురం గ్రామంలో ఈ రైతు ఆశీర్వాద సభను నిర్వహించింది. ఈ సభకు రైతులు మహిళలు యువత పెద్ద ఎత్తున హాజరై ప్రజా ప్రభుత్వానికి తమ మద్దతుని సంఘీభావాన్ని ఏకకాలంలో ప్రకటించారు. వర్షాలు పడి రైతు ఆశీర్వాద సభ భగ్నమవుతుందనే ప్రతిపక్షాల ఆశలను అడి ఆశలు చేస్తూ సభ అత్యంత విజయవంతంగా ముగిసింది.

రైతు ఆశీర్వాద సభ నేపథ్యంలో చింతకాని మండలం జగన్నాధపురంకు వెళ్లే రహదారులన్నీ బస్సులు, ఇతర వ్యక్తిగత వాహనాలతో కిక్కిరిసిపోయాయి.  హెలికాప్టర్ ద్వారా సభా ప్రాంగణానికి చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్వాగతం పలికారు. అనంతరం ఇద్దరు అక్కడి నుంచి సభా ప్రాంగణం వరకు కాలినడకన నడుచుకుంటూ వచ్చారు. మార్గమధ్యంలో భారీ కేడ్లకు ఆనుకొని జేజేలు కొడుతున్న ప్రజలకు అభివాదం చేస్తూ ఇరువురు ముందుకు వెళ్లడం విశేషం. మొత్తంగా చూస్తే జగన్నాథపురం రైతు ఆశీర్వాద సభ ప్రజా ప్రభుత్వానికి ప్రజల జేజేలను.. రైతుల ఆశీర్వాదాన్ని పెద్ద ఎత్తున అందించింది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

సీఎం రాకతో నూతన ఉత్తేజం..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధిర గడ్డపై తొలిసారి అడుగుపెట్టడంతో స్థానిక కార్యకర్తల్లో ఉత్సాహం రెట్టింపైంది. మరోవైపు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తన సమర్థ నాయకత్వంతో సభను విజయవంతం చేసి జిల్లాలో తన రాజకీయ పట్టు మరోసారి చాటుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమంపై తన నిబద్ధతను మరోసారి స్పష్టం చేసింది.

కేవలం తొమ్మిది రోజుల్లోనే రూ.9 వేల కోట్ల రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసి దేశ చరిత్రలోనే అరుదైన రికార్డు సృష్టించిందని నాయకులు పేర్కొన్నారు. రాజకీయ కుతంత్రాలను ప్రజలు తిరస్కరిస్తున్నారనే సందేశాన్ని ఈ సభ ఇచ్చిందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ మరింత బలోపేతమవడంతో పాటు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో విజయానికి ఈ సభ బలమైన పునాదిగా నిలుస్తుందని  విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి.