కాళేశ్వరం పునరుద్ధరణలో విఫలం
- రాష్ట్ర ప్రభుత్వ తీరుతో తీవ్రంగా నష్టపోతున్న రైతులు
- సీఎం రేవంత్‌రెడ్డికి బీజేపీ రాష్ట్ర చీఫ్ రాంచందర్‌రావు లేఖ
హైదరాబాద్, జూలై 12 (విజయక్రాంతి): కాళేశ్వరం బరాజ్‌ల పునరుద్ధరణలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఆరోపించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల పునరుద్ధరణ ఆలస్యంతో రైతులు, ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారనారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డికి కాళేశ్వ రం ప్రాజెక్టు అంశంపై ఆదివారం బహిరంగ లేఖ రాశారు. ఎన్‌డీఎస్‌ఏ సిఫారసులను సకాలంలో అమలు చేయడంలో ప్రభుత్వ వైఫల్యం చెందిందన్నారు.
2024, 2025, 2026లో మూడు పూర్తి వర్కింగ్ సీజన్‌లు ఉన్నా ప్రాజెక్టు పునరుద్ధరణ పనులు పూర్తి చేయలేదన్నారు. 200 టీఎంసీల గోదావరి నీటిని వినియోగించుకునే అవకాశాన్ని ప్రభుత్వం కోల్పోయిందని, ఎన్‌డీఎస్‌ఏ ఇప్పటికే సమగ్ర పరీక్షలు, సాంకేతిక పరిశీలనలు, పునరుద్ధరణ చర్యలు సూచించినా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. జల్ శక్తి మంత్రిత్వ శాఖ ఏ ర్పాటు చేసిన కమిటీ కేవలం సాంకేతిక మార్గదర్శకత్వానికేనని, అమలు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనన్నారు.
ఎన్‌డీఎస్‌ఏ కమిటీపై బాధ్యత నెట్టడం ద్వారా సీఎం తన బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అన్నారం, సుందిళ్ల బరాజ్‌లకు తక్కువ నష్టం జరిగిందని, వాటిని ముందే పునరుద్ధరిస్తే ఉత్తర తెలంగాణకు నీరు అందేదని, దాదాపు 25 లక్షల ఎకరాలకు సాగునీరు, హైదరాబాద్, ఉత్తర తెలంగాణకు తాగునీరు అందించే అవకాశం కోల్పోయిందని లేఖలో తెలిపారు.
బీఆర్‌ఎస్ పెద్దలను కాపాడేందుకే..
విజిలెన్స్ కమిటీ నివేదికను వెంటనే బహిర్గతం చేయాలని, నివేదికలో సూచించిన వారిపై పూర్తిస్థాయిలో ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని రాంచందర్‌రావు పేర్కొన్నారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక విషయంలో ప్రభుత్వం హైకోర్టులో సమర్ధంగా వాదించలేదని విమర్శించారు.
బీఆర్‌ఎస్ పెద్దలను కాపాడేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. సీబీఐ విచారణకు కేవలం మూడు బరాజ్‌లకే పరిమితమైన టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఇచ్చారని తెలిపారు. రూ.1.30 లక్షల కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తంపై సీబీఐ విచారణకు ఎందుకు వెనుకాడుతున్నారని ప్రశ్నించారు.






