బదిలీ ఉద్యోగులకు ఆత్మీయ వీడ్కోలు
- వారి అంకిత సేవలను కొనియాడిన ఈవో
- శ్రీ భీమేశ్వర సదన్‌లో కారక్రమ నిర్వహణ
వేములవాడ, జూలై 12 (విజయక్రాంతి): వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో బదిలీపై వెళ్తున్న 14 మంది ఉద్యోగులకు ఆలయ కార్యనిర్వహణాధికారి ఎల్ రమాదేవి ఆదివారం ఆత్మీయంగా వీడ్కోలు పలికారు.యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నుంచి రెండేళ్ల క్రితం వేములవాడకు వచ్చిన ఉద్యోగులను అధికారికంగా రిలీవ్ చేశారు. శ్రీ భీమేశ్వర సదన్లో నిర్వహించిన కార్యక్రమంలో ఈవో రమాదేవి ఉద్యోగులకు స్వామివారి శేషవస్త్రం, లడ్డు ప్రసాదం అందజేసి సత్కరించారు.
అనంతరం మాట్లాడుతూ దేవస్థానంలో గత రెండేళ్లుగా ఉద్యోగులు అంకితభావంతో పనిచేసి భక్తులకు మెరుగైన సేవలు అందించారని ప్రశంసించారు. రాజరాజేశ్వరస్వామి, శ్రీ భీమేశ్వరస్వామివారి అనుగ్రహం ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఉద్యోగులతో కలిసి పనిచేసిన అనుభవాలను గుర్తుచేసుకున్న ఈవో భావోద్వేగానికి గురయ్యారు.
కార్యక్రమంలో ఆనందంతో పాటు వీడ్కోలు బాధ కూడా కనిపించింది. బదిలీ ఉద్యోగులు కూడా దేవస్థానంలో గడిపిన అనుభవాలను గుర్తు చేసుకుంటూ సహచరులకు కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగులు క్రమశిక్షణ, సేవాభావంతో పనిచేసి దేవస్థానం అభివృద్ధికి విశేషంగా కృషి చేశారని అధికారులు అభినందించారు.ఈ కార్యక్రమంలో డీఈవో నవీన్కుమార్, ఈఈ రాజేష్, ఆలయ అర్చకులు, వేదపండితులు, దేవస్థానం అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.






