calender_icon.png 18 February, 2026 | 3:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అధికారంలో ఉన్నా హస్తగతం చేసుకోవడంలో వైఫల్యం

18-02-2026 12:00:00 AM

  1. మూడింటిలో ఒక్క మున్సిపాలిటీలోనే కాంగ్రెస్ విజయం 

అది కూడా బీజేపీ మద్దతుతోనే..

జిల్లా నాయకుల మధ్య వర్గ పోరే కారణం 

కొందరు అభ్యర్థులకు అందని పార్టీ ఫండ్ 

ఓట్లు రాల్చని సంక్షేమ పథకాలు

మేడ్చల్, ఫిబ్రవరి 17 (విజయ క్రాంతి): రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ మేడ్చల్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించలేకపోయింది. మూడు మున్సిపాలిటీలలో ఒక్క మున్సిపాలిటీ తోనే సరిపెట్టుకుంది. అది కూడా హంగ్ లో బిజెపి మద్దతుతో గట్టెక్కింది. బిజెపి వ్యూహాత్మకంగా వ్యవహరించి ఉంటే అది కూడా వచ్చేది కాదు.

రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కాంగ్రెస్ మెజారిటీ చైర్ పర్సన్ స్థానాలను సాధించగా, మేడ్చల్ జిల్లాలో మాత్రమే ప్రతికూల ఫలితాలు రావడం గమనార్హం. మూడు మున్సిపాలిటీలలో 68 వార్డులు ఉండగా కాంగ్రెస్ పార్టీ 25 వార్డులను మాత్రమే గెలుచుకుంది. బి ఆర్ ఎస్ 33, బిజెపి 8 వార్డులలో విజయం సాధించాయి. జిల్లాలో మెరుగైన ఫలితాలు రాకపోవడానికి కారణమేమిటనేది పార్టీ శ్రేణుల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.

కాంగ్రెస్ నాయకుల మధ్య ఆధిపత్య పోరు, జిల్లా అధ్యక్షుడి నిర్లక్ష్యం కూడా కారణమని ఆ పార్టీ కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. అంతేగాక సంక్షేమ పథకాలు సైతం ఓట్లు రాల్చలేకపోయాయి. మున్సిపల్ ఎన్నికలకు మల్కాజ్గిరి పార్లమెంటుకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఇన్చార్జిగా ముఖ్యమంత్రి నియమించారు. ఈయన ఒకసారి కార్యకర్తల సన్నాహక సమావేశానికి, మరోసారి అలియాబాద్, మూడు చింతలపల్లి ఎన్నికల ప్రచారానికి వచ్చారు. ఆ తర్వాత మళ్లీ ఇటువైపు రాలేదు. జిల్లా నాయకుల మీద వదిలేశారు. 

నాయకుల మధ్య ఆధిపత్య పోరు 

నాయకుల మధ్య ఆధిపత్య పోరు ఉంది. దీనివల్ల కొందరు నాయకులు సరిగా పని చేయలేదని ఆ పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. జిల్లా అధ్యక్షుడు వజ్రష్ యాదవ్ ఒంటెతు పోకడలు కూడా కారణమని అంటున్నారు. జిల్లా అధ్యక్షుడు అందరు నాయకులను కలుపుకొని పోవడం లేదని, దీంతో నాయకులు అంటి ముట్టనట్లు ఉంటున్నారని అంటున్నారు. మున్సిపల్ ఎన్నికల కోసం పార్టీ ఫండ్ బాగానే వచ్చినట్లు తెలిసింది. పార్టీ ఫండ్ అభ్యర్థులకు సరిగా పంపిణీ చేయలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు అభ్యర్థులు తమకు తక్కువగా అందిందని బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. 

కాంగ్రెస్ ను గట్టెక్కించని సంక్షేమ పథకాలు 

కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆరు గ్యారంటీ పథకాలను ప్రకటించింది. అధికారంలోకి రాగానే ఈ పథకాలు అమలు చేస్తామని ప్రకటించింది. అందులో ముఖ్యమైన గృహలక్ష్మి, మహాలక్ష్మి, ఇందిరమ్మ ఇల్లు తదితర పథకాలు అమలు చేస్తోంది. సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో అమలు కావడంలేదని ఆరోపణలు ఉన్నాయి. సంక్షేమ పథకాల లబ్ధిదారుల సైతం కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేయలేదని ఫలితాల సరళి బట్టి తెలుస్తోంది.

ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని ఎల్లంపేట 24వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థికి కేవలం నాలుగు ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈ వార్డులో మహిళలు ఉచిత ప్రయాణం చేస్తున్నారు. ఇతర సంక్షేమ పథకాల ఫలాలు అందుకునే వారు ఉన్నారు. ఇందిరమ్మ ఇల్లు పథకం కింద ఈ వార్డుకు 11 ఇల్లు మంజూరు అయ్యాయి. వీరందరూ కాంగ్రె స్కు ఓటు వేయలేదని తెలుస్తోంది. ఈ వార్డులోనే కాకుండా మరికొన్ని వార్డులలోనూ తక్కువ ఓట్లు వచ్చాయి.

ఎనిమిదవ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థికి 29, పదవ వార్డులో 74, ఏడవ వార్డులో 90 ఓట్లు వచ్చాయి. మూడు చింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పొన్నాల గ్రామాన్ని ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు పంపిణీకి పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు.

ఈ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి నాలుగో స్థానం వచ్చింది. బి ఆర్ ఎస్ అభ్యర్థికి 258, స్వతంత్ర అభ్యర్థికి 211, బిజెపి అభ్యర్థికి 168 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థికి 97 ఓట్లు మాత్రమే వచ్చాయి. కాంగ్రెస్ కు పోలైన ఓట్ల సరళని చూస్తే సంక్షేమ పథకాలు ఓట్లు రాల్చలేదని తేలిపోయింది. సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఎందుకు ఓటు వేయలేదని విషయంలో ప్రభుత్వం, కాంగ్రెస్ అధిష్టానం సమీక్ష చేయాలని ఆ పార్టీ కార్యకర్తలు కోరుతున్నారు.