calender_icon.png 18 February, 2026 | 4:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొత్త పొత్తు.. సరికొత్త ఎత్తు!

18-02-2026 12:00:00 AM

  1. చర్చనీయాంశంగా ఆమనగల్లు చైర్మన్ ఎన్నిక
  2. కాంగ్రెస్, బీజేపీ నిర్ణయంపై విమర్శల పర్వం
  3. బీఆర్‌ఎస్ కు చెక్ పెట్టేందుకు సహకారం
  4. సోషల్ మీడియా వేదికగా సెటైర్లు, కామెంట్లు
  5. గిరిజన నాయకుడిని చైర్మన్ చేయడం తప్పా: ఆచారి

ఆమనగల్లు, ఫిబ్రవరి 17( విజయక్రాంతి) రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనే మాట స్పష్టమని తేలిపోయింది. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వేళ రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మున్సిపాలిటీ వేదికగా జరిగిన హైడ్రామా చూస్తుంటే సామాన్య ప్రజలు సైతం రాజకీయాలను ఛీదరించుకుంటున్నారు. దేశవ్యాప్తంగా ఢీ అంటే ఢీ అనే బీజేపీ, కాంగ్రెస్.. కేవలం బీఆర్‌ఎస్ను అడ్డుకోవడమే లక్ష్యంగా చేతులు కలపడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆమనగల్లు మున్సిపాలిటీలో మొత్తం 15 వార్డులు ఉండగా, ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారు.

8 స్థానాల్లో విజయకేతనం ఎగరవేసిన బీఆర్‌ఎస్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. బీజేపీ ఆరు స్థానాలకు పరిమితం కాగా, కాంగ్రెస్ కేవలం ఒక్కటంటే ఒక్క వార్డులో మాత్రమే గెలిచింది. ప్రజాస్వామ్య సూత్రాల ప్రకారం చైర్మన్ పదవి బీఆర్‌ఎస్కు దక్కాలి. కానీ, తెరవెనక జరిగిన చీకటి ఒప్పందాలు రాజకీయ ముఖచిత్రాన్నే మార్చేశాయి.

ఎక్స్ అఫీషియో ఓట్ల మాయాజాలం

కాంగ్రెస్ పార్టీ తనకున్న ఒక్క కౌన్సిలర్ బలంతో పాటు బీఆర్‌ఎస్ పార్టీ నుంచి గెలుపొందిన కౌన్సిలర్ పత్యానాయక్ ఎంపీ మల్లు రవి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరారు. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఎక్స్ అఫీషియో ఓటును అస్త్రంగా చేసుకుంది. దీంతో కాంగ్రెస్ బలం ముగ్గురు సభ్యులకు చేరింది. అయితే, అధికారం దక్కాలంటే కనీసం 9 ఓట్లు కావాలి.

ఇక్కడే అసలైన డ్రామా మొదలైంది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ముక్త్ భారత్ అని నినదించే బీజేపీ, ఇక్కడ మాత్రం తన సిద్ధాంతాలను తుంగలో తొక్కేసింది. ఆరుగురు కౌన్సిలర్లు ఉన్నప్పటికీ, కేవలం ఒక్క వార్డు గెలిచిన కాంగ్రెస్కు చైర్మన్ పదవిని అప్పగించేందుకు సిద్ధపడటం కార్యకర్తలను విస్మయానికి గురిచేస్తోంది.  ‘బీఆర్‌ఎస్ రాకూడదు.. చైర్మన్ పీఠం దక్కకూడదు’ అనే ఏకైక దుర్బుద్ధితో బీజేపీ, కాంగ్రెస్తో అక్రమ పొత్తు పెట్టుకున్నదని, కేవలం వైస్ చైర్మన్ పదవి దక్కితే చాలన్నట్లు బీజేపీ వ్యవహరించడంపై ఆ పార్టీ అభిమానులే మండిపడుతున్నారు.

ఇదేం రాజకీయం?

ఈ అపవిత్ర రాజకీయ పొత్తులపై ఆమనగల్లు ప్రజలు, రాజకీయ విశ్లేషకులు విమర్శలు గుప్పిస్తున్నారు. సిద్ధాంతాలు లేని ఈ పార్టీలు ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నాయి? శవ రాజకీయాలకు తెరలేపి, ప్రజా తీర్పును అపహాస్యం చేస్తారా? అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. రాజకీయాల్లో విలువలనేవి మచ్చుకైనా కనిపించడం లేదు.

అధికారం కోసం ఢిల్లీలో కొట్టుకునే పార్టీలు, గల్లీలో ఒక్కటవ్వడం చూస్తుంటే అసహ్యం వేస్తోందని స్థానిక ఓటర్లు బహిరంగంగానే చర్చిం చుకుంటున్నారు. ఏదేమైనా ఆమనగల్లు ము న్సిపల్ ఎన్నికల ఫలితం రాజకీయ చరిత్రలో మాయని మచ్చగా మిగిలిపోతుందని చెప్పొ చ్చు. బీజేపీ, కాంగ్రెస్ అనధికార బంధం ఎన్నాళ్లు కొనసాగుతుందో వేచిచూడాలి. 

ఇది బీజేపీ, కాంగ్రెస్ పొత్తు కాదు: ఆచారి

ఆమనగల్లు మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పొత్తు అనైతికమని వస్తున్న విమర్శలపై బీజేపీ జాతీయ నాయకుడు టి.ఆచారి స్పందించారు. తాము ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయలేదని, పత్యానాయక్ బీఆర్‌ఎస్ గుర్తుపై గెలిచిన కౌన్సిలర్ అని గుర్తు చేశారు. బీఆర్‌ఎస్ లో గ్రూపు తగాదాల కారణంగా బయటికి వచ్చిన వ్యక్తికి తాము మద్దతు ఇచ్చామని తెలిపారు. దీన్ని బీజేపీ, కాంగ్రెస్ పొత్తుగా కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాము రాజకీయ ఎత్తుగడల్లో భాగంగానే గిరిజన నాయకుడు పత్యానాయక్ కు మద్దతు తెలిపామన్నారు.

రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన కౌన్సిలర్లు చైర్ పర్సన్ కు మద్దతు తెలపడం వారి హక్కు అని అన్నారు. కొందరు బీఆర్‌ఎస్ నేతలు పిచ్చిపట్టినట్లుగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. వారికి రాజకీయంగా, మరోరకంగా ట్రీట్ మెంట్ ఇస్తామన్నారు. గిరిజన నాయకుడి క్లినిక్ పై దాడి చేయడం హేయమైన చర్య అన్నారు. ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్‌ఎస్ కార్యకర్తలను దాడికి ఉసిగొల్పడం దేనికి సంకేతమన్నారు. రాజకీయాల్లో ఇలాంటి సంస్కృతి మంచిది కాదన్నారు. పోలీసులు వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.