నకిలీ సర్టిఫికెట్ల దందా
- కరీంనగర్ కేంద్రంగా నిర్వహణ
- విద్యుత్ శాఖలో వెలుగులోకి అక్రమాలు
కరీంనగర్, జూన్ 5 (విజయక్రాంతి): కరీంనగర్ కేంద్రంగా నకిలీ సర్టిఫికెట్ల దందా కొనసాగగా.. అక్రమాలు విద్యుత్ శాఖలో వెలుగుచూశాయి. ముఖ్యంగా 2010 మధ్య కాలంలో (తెలంగాణ ఏర్పాటుకు ముందు) ఆన్‌లైన్ వెరిఫికేషన్ సిస్టమ్స్ అందుబాటులో లేకపోవడాన్ని కొందరు కేటుగాళ్లు అనుకూలంగా మార్చుకున్నారు. కరీంనగర్‌లోని కొన్ని స్టడీ సెంటర్లు, కన్సల్టెన్సీల ద్వారా లక్షల రూపాయలు వసూలు చేసి, పరీక్షలు రాయకుండానే డిగ్రీలు, డిప్లొమా ఐ టీఐ నకిలీ ధ్రువీకరణ పత్రాలను సృష్టించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
విద్యుత్ శాఖ లో తెలంగాణ సదరన్, నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలలో కొందరు ఉద్యోగులు తప్పుడు విద్యార్హత సర్టిఫికెట్లతో ప్రమోషన్లు పొందారని, ఒక్కో ప్రమోషన్ కోసం భారీగా డబ్బులు చేతులు మారాయనే ఆరోపణలు గతంలోనూ వచ్చాయి. ఇటీవల విద్యుత్ శాఖల్లో నకిలీ ఐటీఐ, ఇతర సర్టిఫికెట్లు సమర్పించి ఉద్యోగాలు పొందిన పలువురు షిఫ్ట్ ఆపరేటర్లు, ఇతర సిబ్బందిని ఉన్నతాధికారులు విచారణ జరిపి విధుల్లోంచి తొలగిం చారు.
కరీంనగర్, జగిత్యాల ప్రాంతాల్లో నకి లీ సర్టిఫికెట్ల ముఠాలు ఇతర రాష్ట్రాల (ఉదాహరణకు వెస్ట్ బెంగాల్, ఢిల్లీ) ఓపెన్ స్కూల్స్ లేదా యూనివర్సిటీల పేరుతో నకిలీ పత్రా లు తయారు చేసినట్టు భావిస్తున్నారు. ఫొ టోషాప్, సాఫ్ట్‌వేర్ మాయాజాలం ఒరిజినల్ సర్టిఫికెట్లను స్కాన్ చేసి, సాఫ్ట్‌వేర్ సాయం తో పేర్లు, రోల్ నంబర్లు మార్చి నకిలీవి తయారు చేస్తున్నట్టు తెలిసింది.
లక్షల రూపాయలు వసూలు చేసి కొన్ని స్టడీ సెంటర్ల ద్వారా చదవకుండానే డిగ్రీ, డిప్లొమా సర్టిఫికెట్లు అందజేసినట్లు సమాచారం. 2010-- 2014 మధ్య కాలంలో ఆన్‌లైన్ ధ్రువీకరణ వ్యవస్థ లేకపోవడాన్ని ఆసరాగా చేసుకుని ఈ అక్రమాలు జరిగినట్లు తెలుస్తోంది. విద్యుత్ శాఖలో నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారం వెలుగులోకి రావడంతో కరీంనగర్ కేంద్రం గా సాగిన ఈ నెట్‌వర్క్‌పై ప్రభుత్వం విచారణ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.






