13 June, 2026 | 1:40 AM

నకిలీ విత్తనాల ముఠా గుట్టు రట్టు

13-06-2026 12:35 AM
  1. రూ. 30 లక్షల సీడ్స్ స్వాధీనం
  2. ముగ్గురి అరెస్ట్

మేడ్చల్, జూన్ 12 (విజయ క్రాంతి): హైదరాబాద్‌లోని మల్కాజిగిరి ఎస్‌వోటీ, తిరుమలగిరి పోలీసులు భారీ నకిలీ పత్తి విత్తనాల ముఠాను పట్టుకుని, రూ.30 లక్షల విలువైన విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. బాలశౌరెడ్డి అలియాస్ శివారెడ్డి అనే వ్యక్తి న్యూ రైతు సంపద సీడ్స్ కంపెనీకి ఎండీగా వ్యవహరిస్తున్నారు. నష్టాలు రావడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో మరో కంపెనీ పేరుమీద పత్తి విత్తనాలు విక్రయానికి తెరలేపాడు. గుజరాత్‌కు చెందిన నర్మదా సాగర్ అగ్రి సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన పౌచులను తయారుచేసి అందులో నకిలీ పత్తి విత్తనాలను పెట్టి విక్రయిస్తున్నాడు.

దీంతో ఆ కంపెనీ వారు తిరుమలగిరి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేపట్టారు. బోయిన్‌పల్లి మార్కెట్ వద్ద మారుతి ఈకో వ్యాన్ తనిఖీ చేయగా అందులో 12,800 పౌచులు లభ్యమయ్యాయి. శివారెడ్డి , కాపర్తి బెంజిమెన్ రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. దొంగ శీను అనే వ్యక్తి పౌచులు తయారుచేశాడు.దీంతో ఈ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. బండ్లగూడలోని వీరి కంపెనీలో సోద చేయగా రెండు టన్నుల నకిలీ విత్తనాలు లభ్యమయ్యాయి. వీరిని అరెస్టు చేసి, రూ. 30 లక్షల విలువైన నకిలీ విత్తనాలు, మారుతి ఈకో వ్యాన్, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో డీసీపీ సురేష్ కుమార్, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.