23 May, 2026 | 12:53 AM

నకిలీ విత్తనాల ముఠా అరెస్ట్

23-05-2026 12:05 AM

సిర్పూర్లో 5.45 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం 

ఇద్దరు నిందితుల రిమాండ్

వివరాలు వెల్లడించిన ఎస్పీ నితికాపంత్

కుమ్రం భీం ఆసిఫాబాద్/జైనూర్, మే 22 (విజయ క్రాంతి): రైతులను మోసం చేసి అక్రమ లాభాలు పొందేందుకు నకిలీ పత్తి విత్తనాలను విక్రయిస్తున్న ముఠాను పోలీసులు ఛేదించారు. సిర్పూర్ (యు) మండలంలో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో 5.45 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకుని ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ నితికా పంత్ వెల్లడించారు.

శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో నకిలీ విత్తనాల అక్రమ రవాణా, విక్రయాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతున్న నేపథ్యంలో శుక్రవారం సిర్పూర్ (యు) పోలీస్ స్టేషన్ సమీపంలో ఎస్‌ఐ విక్రమ్ తన సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా, వారి వద్ద 152 ప్యాకెట్లలో సుమారు 68 కిలోల పత్తి విత్తనాలు లభించాయి.

విత్తనాల ప్యాకెట్లపై ప్రభుత్వ గుర్తింపు వివరాలు, క్యూఆర్ కోడ్, హోలోగ్రామ్, లాట్ నంబర్ వంటి తప్పనిసరి గుర్తులు లేకపోవడంతో వ్యవసాయ శాఖ అధికారులను అప్రమత్తం చేశారు. వ్యవసాయ శాఖ అధికారి ఆనందరావు పరిశీలించి వాటిని నకిలీ పత్తి విత్తనాలుగా నిర్ధారించారు.దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు, నిందితుడు నైతం జంగు నివాసంలో సోదాలు నిర్వహించగా మరో 1,100 ప్యాకెట్లలో 4.90 క్వింటాళ్ల నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు.

మొత్తం 5.45 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.రైతులు నకిలీ విత్తనాల బారిన పడకుండా రైతులు కేవలం లైసెన్స్ పొందిన విక్రయ కేంద్రాల నుంచే విత్తనాలు కొనుగోలు చేయాలని, ప్యాకెట్లపై క్యూఆర్ కోడ్, హోలోగ్రామ్, లాట్ నంబర్ తదితర వివరాలను తప్పనిసరిగా పరిశీలించాలని సూచించారు. నకిలీ విత్తనాలపై సమాచారం ఉంటే వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు , డయల్-100కు సమాచారం అందించాలని కోరారు.

దర్యాప్తులో గత రెండు నెలలుగా ఈ విత్తనాలను రైతులకు విక్రయించేందుకు సిర్పూర్ మండలానికి తరలించినట్లు వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంలో మధ్యప్రదేశ్కు చెందిన మంగునాథ్, సిర్పూర్ (యు)కు చెందిన నైతం జంగును అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.ఈ కేసును ఛేదించడంలో కృషి చేసిన డీఎస్పీ అశోక్, ఎస్‌ఐ విక్రమ్, కానిస్టేబుళ్లు నాగేంద్రబాబు, నాగేంద్రలను ఎస్పీ అభినందించారు.