23 May, 2026 | 1:30 AM

ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి

23-05-2026 12:46 AM

నారాయణఖేడ్, మార్చ్ 22: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలలో రైతులు ఎదుర్కొంటున్న తీవ్ర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నారాయణఖేడ్ మండల రెవెన్యూ అధికారికి వినతి పత్రాన్ని  శుక్రవారం అందించారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షులు సిందోల్ దశరథ్, పట్టణ అధ్యక్షులు రాజశేఖర్ గౌడ్ లు మాట్లాడుతూ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్లే రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకునే దారుణ పరిస్థితులు నెలకొన్నాయని మండిపడ్డారు.

కొనుగోలు కేంద్రాల్లో అధికారుల నిర్లక్ష్యం, కనీస సౌకర్యాలు లేకపోవడం వల్ల అన్నదాతలు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు రోడ్డు ఎక్కిన తర్వాత స్పందించడం కాదు... కొనుగోలు కేంద్రాల్లో వారి కన్నీళ్లు తుడువాల్సిన కనీస బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉందని తెలిపారు. కొనుగోలు కేంద్రాలలో తక్షణమే సరిపడా వేయింగ్ కాంటాలు, గన్ని బ్యాగులు, హమాలీలు, లారీలను పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచాలని.

తరుగు, తేమ, తాలు పేరుతో రైతులను నిలువునా మోసం చేస్తున్న దళారులపై, అలాగే కొనుగోలు ప్రక్రియలో అవకతవకలకు పాల్పడుతున్న అధికారులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. లేనిపక్షంలో రైతుల పక్షాన బీజేపీ పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పట్నం మాణిక్, సచిన్, అశోక్, పవన్, కృష్ణ, బాయిని శ్రీనివాస్,రవి యాదవ్,మోహన్, నవీన్ కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.