అభివృద్ధిని ఓర్వలేకే అసత్యపు ఆరోపణలు
మాజీ మంత్రి రామన్నపై ఎమ్మెల్యే పాయల్ ఫైర్
ఆదిలాబాద్, ఫిబ్రవరి 27 (విజయక్రాంతి): ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఎయిర్పోర్ట్ మరికొన్ని నెలల్లో ప్రారంభం కానుందనీ, అలాగే రైల్వే అండర్ బ్రిడ్జ్ పనులను జూన్ నెలలో పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం అని, ఈ అభివృద్ధి పనులను చూసి మాజీ మంత్రి జోగు రామన్న ఓర్వలేకనే తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నా రని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు.
శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... మంత్రి గా ఉన్న సమయంలో ఎయిర్పోర్ట్ ఫైల్ కేసీఆర్ దగ్గర పది సంవత్సరాలు పెండింగ్లో ఉంటే అప్పుడు నువ్వు ఏమి చేస్తున్నావు అని జోగు రామన్న ను ఎమ్మెల్యే ప్రశ్నించారు. 20 ఏళ్లుగా చేయలేని పనులు తాను రెండు సంవత్సరాల్లో సాధించే ప్రయత్నం చేస్తుంటే అది రామన్న జీర్ణించుకోవడం లేదన్నారు. నిన్న రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ప్రతిపాదిత ఇండస్ట్రియల్ పార్క్ కోసం ఆదిలాబాద్కు వస్తే నీకు ఎందుకు నొప్పి అని ప్రశ్నించారు.
తాను గెలిచిన ఈ రెండేళ్ల పాలనలో వ్యాపారులను, అధికారులను మోసం చేశానని లేదా చందాలు వసూలు చేశానని నిరూపిస్తే రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటా అని స్పష్టం చేశారు. ఏరియల్ సర్వే ప్రతిపాదిత ప్రాంతంలో కాకుండా ఇంకెక్కడా చేస్తారో మీకే తెల్వాలి అని బదులిచ్చారు. నువ్వు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎన్ని ప్రయత్నాలు చేసిన ఆదిలాబాద్‌కు రావాల్సిన అభివృద్ధి పనుల కోసం నా ప్రయత్నం ఎప్పటికీ ఆపనని చెప్పారు. పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.




