28 February, 2026 | 5:16 PM

చెన్నూర్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం

28-02-2026 12:00 AM

మంత్రి వివేక్ వెంకటస్వామి

చెన్నూర్, ఫిబ్రవరి 27 : రాష్ట్రంలో చెన్నూర్ మున్సిపాలిటీనీ అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని మంత్రి వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. శుక్ర వారం చెన్నూర్ మున్సిపాలిటీలో నూతనంగా ఎన్నికైన మున్సిపల్ చైర్పర్సన్ పెద్దింటి పద్మ పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మున్సిపాలిటీలో సుమారు రూ. 50 కోట్ల నిధులతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. అనేక వార్డుల్లో బోర్వెల్స్, సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అమృత్ 2.0 పథకం ద్వారా ఇంటింటికి తాగునీరు అందజేస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం మిషన్ భగీరథ పేరిట నిధులను దుర్వినియోగం చేసిందని విమర్శిం చారు. చెన్నూరు పట్టణ ప్రజలకు గోదావరి నుంచి శుద్ధజలాల పథకాన్ని అమలు చేస్తామని తెలిపారు. త్వరలో పట్టణంలో రోడ్డు విస్తరణ పనులు కూడా చేపడతామని వెల్లడించారు. పట్టణంలోని కుల సంఘాల భవనాల నిర్మాణానికి ఇప్పటికే నిధులు కేటాయించామని, మరో ఆరు నెలల్లో గోదావరి ఇసుకను అందుబాటులోకి తీసుకువ స్తామని హామీ ఇచ్చారు.

మారెమ్మవాడలో రహదారి సమస్యను పరిష్కరించామని గుర్తుచేశారు. మున్సిపాలిటీలో 100 కొత్త ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని, ఈ సమస్యలపై కేబినెట్లో చర్చలు జరిపినట్లు పేర్కొన్నారు. దేవులవాడ, బబ్బేరు, చెలుక గ్రామాల రైతులకు సుమారు రూ.18 కోట్ల పరిహారం మంజూరు చేసి పంపిణీ చేసినట్లు వివరించారు. మే నెలలో 100 పడకల ఆసుపత్రిని ప్రారంభించనున్నట్లు తెలిపారు. కోటి ఇరవై లక్షల రూపాయలతో శ్మశానవాటిక అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయన్నారు.

కాంగ్రెస్ పార్టీ నాయకులను గెలిపిం చి మున్సిపాలిటీలో బాధ్యతలు అప్పగించినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం చైర్పర్సన్తో పాటు పాలకవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ పద్మ మాట్లాడుతూ మంత్రి వివేక్ వెంకటస్వామి సహకారంతో చెన్నూర్ మున్సిపాలిటీలో పాలకవర్గ సభ్యులం అభివృద్ధికి ప్రధాన పీఠవేస్తామన్నారు. అనంతరం బాధ్యతలు చేపట్టారు.