తప్పుడు ప్రచారం
- ధాన్యం కొనుగోళ్లపై రైతులను అయోమయంలో పడేయడమే ప్రతిపక్షాల లక్ష్యం
- ఇప్పటివరకు 17.28 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు
- రైతుల ఖాతాల్లో రూ.2,310 కోట్లు
- తాలు పేరుతో తరుగుతీస్తే కఠిన చర్యలే
- మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హెచ్చరిక
హైదరాబాద్, మే 6 (విజయక్రాంతి) : ధాన్యం కొనుగోళ్ల అంశంపై విపక్షాలు దుష్పచారం చేస్తున్నాయని, బీఆర్‌ఎస్ అసత్య ప్రచారానికి పాల్పడుతోందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. రైతులను అయోమయంలో పడేసేందుకు ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే రికా ర్డు స్థాయిలో ధాన్యం దిగుబడి సాధించిందన్నారు.
ఈ రబీ సీజన్‌లో 67 లక్షల ఎకరాలలో వరి సాగయిందని, 141 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి రానుందని తెలిపారు. బుధవారం సచివాలయంలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మీడి యాతో మాట్లాడుతూ.. ఈ సీజన్‌లో 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం సన్నద్ధంగా ఉందని, ఇప్పటివరకు 17.28 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడంతో పాటు రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ. 2, 310 కోట్లు జమచేశామని మంత్రి పేర్కొన్నారు.
ఈ రబీ సీజన్‌లో ధాన్యం కొనుగోలుకు గాను రూ. 21 వేల కోట్లు కేటాయించామన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మౌలిక సదుపాయాలను కల్పించామని, అయినా బీఆర్‌ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. ‘రాష్ట్ర వ్యాప్తంగా 8,575 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశాం. అకాల వర్షాలు సంభవిస్తే ధాన్యం తడిసిపోకుంటా ఉండేందుకు 2.63 లక్షల టార్బాలిన్స్, 18.75 కోట్ల గన్ని బ్యాగులు అందుబాటులో ఉంచాం.
64.83 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వ చేసే సామర్ధ్యం ఏర్పాటు చేశాం. అదనంగా 11.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వ చేసేందుకు గోదాముల గుర్తించాం. కొనుగో లు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించేందుకు గాను 6,200 వాహనాల ఏర్పాటుచేశాం’ అని మంత్రి ఉత్తమ్ వివరించారు. దేశం మొత్తంలోనే రికార్డు స్థాయిలో దిగుబడి, కొనుగోళ్లు జరిపింది తెలంగాణా రాష్ట్రంలోనేనని వివరించారు.
ప్రత్యేక నోడల్ అధికారి..
‘కొనుగోలు కేంద్రాలలో రైతులకు దాహార్తి తీర్చేందుకు వీలుగా మంచినీరు, ఓఆర్‌ఎస్ సరఫరా చేస్తున్నాం. కొనుగోలు కేంద్రాలలో రైతులు చనిపోతే తక్షణమే పరిహారం ఇస్తు న్నాం. ఉదయం, సాయంత్రం పూట కొనుగోలు చేస్తున్నాం. అకాల వర్షాలు సంభవిస్తే రైతులు, సిబ్బంది చెట్లు కింద, కరెంట్ స్తం భాల దగ్గర ఉంటే పిడుగుపాటుకు గురి కాకుండా సూచనలు చేస్తున్నాం. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఎప్పటికప్పుడు రాష్ట్రస్థాయి నోడల్ అధికారి పర్యవేక్షణ జరుగు తోంది.
పౌర సరఫరాల శాఖా కేంద్ర కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాం. వాతావరణంలో సంభవిస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు కొనుగోలు కేంద్రాలకు సమాచారం అందించేందుకు ప్రత్యేక మెకానిజం రూపొందించాం. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు నిరీక్షించకుండా ప్రత్యేక టోకెన్లు విధానం ఏర్పాటు చేశాం ’ అని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.
కొనుగోళ్లు, నిధులు జమ ఇలా..
* 2023- -24 బీఆర్‌ఎస్ హయాంలో ఖరీఫ్ లో 47.34 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 2024- 25 ఖరీఫ్ లో 53.95 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశాం
* 2023- 24 బీఆర్‌ఎస్ పాలనలో ఖరీఫ్ లో కొనుగోలు చేసిన ధాన్యానికి10,415 కోట్లు చెల్లిస్తే , కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 2024-- 25 ఖరీఫ్ లో 12,512 కొట్లు చెల్లించాం.
* కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2023- -24 రబీలో 7178 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 7. 62 లక్షల మంది రైతుల నుండి 47.97 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రూ. 10,549 కోట్లు రైతులకు చెల్లించాం.
* 2024-- 25 రబీలో 8378 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 10. 87 లక్షల మంది రైతుల నుండి 74.21 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రూ. 17, 198 కోట్లు చెల్లించాము
* 2025- -26 ఖరీఫ్‌లో 8448 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 11. 65 లక్షల మంది రైతుల నుండి 71.86 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రూ. 17, 160 కోట్లు చెల్లించాం.
* ప్రస్తుత రబీలో 8575 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 13లక్షల మంది రైతుల నుంచి 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు లక్ష్యాన్ని పెట్టుకుని రూ. 21,501 కోట్లు రైతులకు చెల్లించెందుకు ప్రభుత్వం సన్నద్ధంగా ఉంది.
బీఆర్‌ఎస్ నేతలు గుణపాఠం నేర్చుకోవడం లేదు..
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాకే రాష్ట్రంలో ధాన్యం దిగుబడి, కొనుగోళ్లు రికార్డు స్థాయిలో జరిగాయని మంత్రి పేర్కొన్నారు. సీజన్‌కు సీజన్ పోటీపడుతూ రికార్డు స్థాయిలో ధాన్యం ఉత్పత్తి జరుగుతుందని, అదే రికార్డు స్థాయిలో ప్రభుత్వం కొనుగోళ్ల ప్రక్రియ చెపట్టిందని మంత్రి ఉత్తమ్ తెలిపారు. బీఆర్‌ఎస్ నేతల తప్పుడు ప్రచారాన్ని రైతులు నమ్మడం లేదన్నారు.
వరుసగా నాలుగు ఎన్నికల్లో ప్రజలు నిర్ద్వంద్వంగా తిరస్కరించినా బీఆర్‌ఎస్ నేతలు గుణపాఠం నేర్చుకోవడం లేదని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. తాలు పేరుతో కోత విధిస్తే చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. బీఆర్‌ఎస్ పాలనతో తూకం, తాలు పేరుతో తరుగుదల తీసీ రైతులకు తీవ్ర నష్టం చేశారన్నారు. ఇది రైతు ప్రభుత్వంమని, రైతులకు నష్టం కలిగించే ఏ చర్యను కాంగ్రెస్ ప్రభుత్వం సమర్దించదన్నారు.






