7 May, 2026 | 2:57 AM

ఇంటర్ పరీక్ష రాయనున్న మాజీ మావోయిస్టు దేవ్‌జీ

07-05-2026 01:46 AM

హైదరాబాద్, మే 6 (విజయక్రాంతి): నాలుగు దశాబ్దాలుగా గెరిల్లా యుద్ధం తర్వాత ఆయుధాలు విడిచిపెట్టి జనజీవన స్రవంతిలో కలిసిపోయిన తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ ఇప్పుడు తన ఇంటర్ విద్యను పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఇందుకు ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షను రాయాలని అనుకుంటున్నారు. 1983 మార్చిలో నిర్వహించిన ఇంటర్ పరీక్షల్లో ఆయన ద్వితీయ సంవత్సరం తెలుగు పేపర్‌లో ఉత్తీర్ణత సాధించలేకపోయారు.

ఇంగ్లీష్, గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీలో మంచి మార్కులు సాధించారు. ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 13 నుంచి ఉండటంతో తెలుగు పరీక్షకు హాజరయ్యేందుకు అనుమతివ్వాలని ఇంటర్‌బోర్డుకు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది. తొలుత ఆయన డిగ్రీ కోర్సు చేసేందుకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అడ్మిషన్ వేయాలని అనుకున్నారు. అయితే డిగ్రీలో ప్రవేశానికి కనీసం ఇంటర్, డిప్లొమా లేదా ఐటీఐ అర్హత తప్పనిసరి చేయడంతో ఆయన ఇంటర్ బోర్డును సంప్రదించారు.

దేవ్‌జీని సప్లమెంటరీ పరీక్షలకు రాసేందుకు అనుమతించడంపై ఇంటర్ బోర్డు ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. రూ.3 వేల ఆలస్య రుసుముతో పరీక్ష ఫీజు చెల్లించేందుకు చివరితేదీ ఈ నెల 4తో ముగిసింది. దీంతో స్పెషల్ కేసుగా ఆయనకు అనుమతి ఇవ్వొచ్చు. కానీ బోర్డు ఇంకా దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదదని వర్గాలు పేర్కొన్నాయి. నాడు ఆయన కోరుట్లలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఎంపీసీ గ్రూపును తీసుకున్నారు. 

ఫీజు చెల్లించిన వారు 3.97 లక్షల మంది.. 

ఇప్పటి వరకు ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు ఫీజు చెల్లించిన విద్యార్థులు మొత్తం 3,97,997 మంది ఉన్నారు. వీరిలో ఫస్ట్ ఇయర్ చెల్లించిన వారు 2,67,141 మంది కాగా, సెకండ్ ఇయర్ విద్యార్థులు 1,30,856 మంది ఉన్నారు.