13-01-2026 08:27:51 PM
- విద్యార్థుల పేరెంట్స్ వెల్లడి
బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని మైనార్టీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలపై కొందరు చేస్తున్న తప్పుడు ప్రచారం తగదని ఆ పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులన్నారు. మంగళవారం బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కె.మాధవి, పీ.స్రవంతి, మైమున్నా తస్లిమ్, ఎండి మహమ్మద్, ఎండి గౌస్,హామీమ్, పీక లక్ష్మణ్ లు మాట్లాడారు. ఈనెల 1వ తేదీన తల్లిదండ్రుల అనుమతితోనే విద్యార్థులను పాఠశాల పక్కనే ఉన్న ఎగ్జిబిషన్ కు పాఠశాల సిబ్బంది తీసుకుపోయారని పేర్కొన్నారు. పిల్లలను ఎగ్జిబిషన్ తీసుకువెళ్లేందుకు ఒక్కొక్క విద్యార్థికి తామే రూ.150 కూడా ఇచ్చామని తెలిపారు.
ఎగ్జిబిషన్ కు వెళ్లిన సమయంలో విద్యార్థులకు ఎలాంటి ఫుడ్ పాయిజన్ కాలేదని, ఫుడ్ పాయిజన్ అయినట్లు కొందరు చేస్తున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని ఖండించారు. బెల్లంపల్లి పట్టణంలో ఎంతో సౌకర్యవంతంగా ఉన్న భవనం లో కొనసాగుతున్న పాఠశాలలో మంచి విద్యాబోధన జరుగుతుందని తెలిపారు. విద్యార్థులకు ఈ పాఠశాలలో ఎలాంటి ఇబ్బందులు లేవని కొందరు పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఇలాంటి వారిపై జిల్లా ఉన్న తాదిరులు విచారణ జరిపించి చర్యలు చేపట్టాలని కోరారు.