31 March, 2026 | 3:35 AM

సహజీవన జంటలకు కుటుంబ హోదా

31-03-2026 01:28 AM

శుభవార్త చెప్పిన కేంద్రం

దేశవ్యాప్తంగా జనగణనకు ఏప్రిల్ ౧నుంచి శ్రీకారం

న్యూఢిల్లీ, మార్చి 30: సహజీవనం చేస్తున్న జంటలకు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ జంటలకు కుటుంబ హోదా ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. దేశవ్యాప్తంగా జనగణన చేసేందుకు కేంద్రం సన్నద్ధమైంది. ఈ ప్రక్రియ ఏప్రిల్ 1 నుంచి రెండు దశలుగా ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కల నిబంధనల్లో కీలక మార్పులు చేసింది. ముఖ్యంగా ఈసారి సహజీవనం చేస్తున్న జంటలకు కుటుంబ హోదా కల్పించాలని నిర్ణయించింది.

చాలాకాలంగా కలిసి నివసిస్తున్న వారిని ఒకే కుటుంబంగా పరిగణించాలని కేంద్రం స్పష్టం చేసింది.ఈ విషయాలను రిజిస్ట్రార్ జనరల్ మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ సోమవారం మీడియాకు వెల్లడించారు. ఇది దేశంలో 16వ జనగణనగా ఉండనుంది.కాగా తొలి దశలో గృహ గణన చేపట్టి అధికారులు మొబైల్ యాప్ సాయంతో ఇంటింటికీ వెళ్లి ఇళ్లకు సంబంధించిన వివరాలు సేకరిస్తారు. రెండో దశలో జనాభా లెక్కల సేకరణ జరుగుతుంది.ఇది వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభం కానుంది.

ఇప్పటివరకు లేనివిధంగా ఈసారి ప్రజలు స్వయంగా తమ వివరాలను నమోదు చేసుకునే అవకాశాన్ని కూడా కేంద్రం కల్పించింది.జనగణన కోసం 33 ప్రశ్నలతో కూడిన ప్రశ్నావళిని రూపొందించారు.ఈ ప్రక్రియలో ఇంటి యజమాని వివరాలు, వ్యక్తిగత సమాచారం, కులం, కమ్యూనిటీ వివరాలు సేకరిస్తారు.ఇంట్లో నివసిస్తున్న వారి సంఖ్య, వారి వయస్సు వంటి అంశాలను కూడా నమోదు చేస్తారు.

అదనంగా, ఫోన్లు, ఇంటర్నెట్, వాహనాలు (సైకిల్, స్కూటర్, బైక్, కారు, జీప్, వ్యాన్) గృహోపకరణాలు (రేడియో, టీవీ) యాజమాన్యం గురించి కూడా అడుగుతారు.ఇంకా తృణధాన్యాల వినియోగం, తాగునీటి వనరులు, మరుగుదొడ్ల వినియోగం, వంటగది సదుపాయాలు, వంటకు ఉపయోగించే ఇంధనం వంటి అంశాలపై కూడా సమాచారం సేకరించనున్నారు.మన దేశంలో సాధారణంగా ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి జనగణన నిర్వహిస్తారు. చివరిసారిగా 2011లో ఈ ప్రక్రియ పూర్తి అయింది. కోవిడ్-19 ప్రభావంతో 2021లో నిర్వహించాల్సిన జనగణన వాయిదా పడింది. ఇప్పుడు తిరిగి ఈ ప్రక్రియను ప్రారంభించేందుకు కేంద్రం సిద్ధమైంది.