అభిమానులు ఆరోగ్య సేవా కార్యక్రమాలు నిర్వహించాలి
బంజారాహిల్స్, జూన్ 11 (విజయక్రాంతి): నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని కారిడార్ 9డిలో వరుసగా రెండవ రోజు సేవ కార్యక్రమం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. నందమూరి బాలకృష్ణ అభిమానులు ,హైదరాబాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సుమారు 240 మందికి ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు.
జంగా శ్రీధర్, సూర్యదేవర అవినాష్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి బంజారాహిల్స్ లోని బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ సిబ్బంది సహకారం అందించారంటూ పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డీజీ ఆర్ బి వి ఆర్ ఆర్, అభిలాష బిషిత్, డీసీపీ రితిరాజ్, గారపాటి శ్రీనివాస్, వెనిగాల గోపాల కృష్ణ, నూకవరపు వేణు తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు జంగా శ్రీధర్, సూర్యదేవర అవినాష్ మాట్లాడుతూ, క్యాన్సర్ను ప్రారంభ దశలోనే గుర్తిస్తే చికిత్స విజయవంతమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, ప్రజల్లో ఆరోగ్య అవగాహన పెంపొందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమన్నారు. బాలకృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకుని అభిమానులు కేవలం వేడుకలకే పరిమితం కాకుండా, సమాజానికి ఉపయోగపడే ఆరోగ్య సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అతిథులు అన్నారు.






