30 June, 2026 | 5:24 AM

సాగు భూములకే రైతు భరోసా?

13-06-2024 01:47 AM

ప్రైవేటు వెంచర్లు, గుట్టలు, పడావు భూములకు సాయం కట్

రాష్ట్రంలోని 8 నుంచి 10 శాతం భూములు సాగుకు యోగ్యతలేనివే

ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులూ అనర్హులే.. 

ఏడున్నర ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకే ‘భరోసా’?

హైదరాబాద్, జూన్ 12 (విజయక్రాంతి): గత ప్రభుత్వం రైతుబంధు పేరిట సంపన్నులు, భూస్వాములు, ప్రభుత్వ ఉద్యోగులు, సెలబ్రెటీలకూ పెట్టుబడి సాయం అందించడంతో ప్రభుత్వ ధనం వృథా అయిందని భావించి, కొత్తగా అధికారంలోకి వచ్చిన సర్కార్ వారందరినీ అనర్హులుగా ప్రకటించనున్నట్లు తెలుస్తున్నది. అలాగే రోడ్లు, పడావు భూములు, ప్రైవేటు వెంచర్లు, గుట్టలతో పాటు వ్యాపార ప్రయోజనాలకు వినియోగించే భూములనూ పథకం నుంచి మినహాయిస్తున్నట్లు సమాచారం.

ఏడున్నర ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకే ‘రైతు భరోసా’ పేరిట పెట్టుబడి సాయం అందించేందుక కసరత్తు ప్రారంభించిందని భోగట్టా. ఈ మేరకు మండలస్థాయిలో మండల వ్యవసాయశాఖ అధికారులకు సాగులో ఉన్న పంట భూముల వివరాలు సేకరిస్తున్నట్లు తెలిసింది. ఈ చొప్పున గతంలో పెట్టుబడి సాయం పొందిన వారిలో సగం కంటే ఎక్కువ మంది అనర్హులుగా తేలతారు. మిగిలిన వారికి ఈ సీజన్ నుంచే పెట్టుబడి సాయం అందించేందుకు కసరత్తు జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. గత ప్రభుత్వం భూముల భద్రత కోసం ప్రారంభించిన ధరణి పోర్టల్‌లో నమోదైన డాటా ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న భూముల్లో 8 శాతం నుంచి 10 శాతం భూములు సాగులేని భూములేనని రాష్ట్రప్రభుత్వం తేల్చినట్లు తెలుస్తున్నది.

‘గ్రేటర్’ పరిసరాల్లో..

గ్రేటర్ హైదరాబాద్ పరిసర ప్రాంతాలతో పాటు జిల్లాలు, మండల కేంద్రాల్లో 20 ఏళ్ల నుంచి రియల్ ఎస్టేట్ గణనీయంగా పెరిగింది. రియల్టర్లు ఇబ్బడి ముబ్బడిగా వెంచర్లు వేసి విక్రయించారు. చాలాచోట్ల ఇప్పటికే అక్కడ భవంతులు, చిన్న కట్టడాలు వెలిశాయి. ఆయా యాజమానుల ఖాతాల్లోనూ గత ప్రభుత్వ హయాంలో పెట్టుబడి సాయం జమ అయింది. ఇలా సుమారు 3 లక్షల మందికి లబ్ధి చేకూరినట్లు తెలుస్తున్నది. అలాగే గుట్టలు, రహదారులు, పడావు భూములు, అక్రమంగా పట్టా చేసిన ప్రభుత్వ భూములు, పారెస్టు భూముల లెక్క కూడా ఇప్పుడు బయట పడనున్నది. ఇవన్నీ కలిపి 2.50 లక్షల ఎకరాలు వరకు ఉండే అవకాశం ఉంది.

లబ్ధిదారులు ఇలా..

రాష్ట్రంలో 68.99 లక్షల మంది రైతులకు 1.52 కోట్ల ఎకరాల భూమి ఉన్నట్లు రెవెన్యూ రికార్డుల వెల్లడిస్తున్నాయి. వీటిలో 73 శాతం 2.47 ఎకరాల రైతులు, 17 శాతం చిన్న రైతులు 2.48 నుంచి 4.94 ఎకరాలు, ఒక శాతం మాత్రమే పెద్ద రైతులు 24.78 ఎకరాలు కలిగిన రైతులు ఉన్నారు. లబ్ధిదారుల్లో 53 శాతం బీసీలు, ఎస్సీలు 13శాతం, ఎస్టీలు 13 శాతం, ఇతర వర్గాలు 21శాతం ఉన్నారు. వీరికి 2018 నుంచి సంవత్సరానికి రెండు విడతలుగా ఏటా ఎకరానికి రూ.10వేల పెట్టుబడి సాయం అందింది. ఇక కోతలు, కత్తెర్ల తర్వాత ఎంతమందికి పెట్టుబడి సాయం అందుతుందో చూడాలి.