30 June, 2026 | 4:25 AM

మల్లారెడ్డి కబ్జా నిజమే

13-06-2024 01:48 AM

సుచిత్రలో ౩౩ గుంటలు కబ్జా చేశారు

హైకోర్టుకు రెవెన్యూ అధికారుల నివేదిక

మేడ్చల్, జూన్ 12 (విజయక్రాంతి): కుత్బుల్లాపూర్ మండలం జీడిమెట్ల గ్రామ రెవెన్యూ పరిధిలోని సుచిత్రలో ఉన్న సర్వే నంబర్ 82లో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత చామకూర మల్లారెడ్డి ౩౩ గుంటల భూమిని కబ్జా చేశారని రెవెన్యూ అధికారులు తేల్చారు. ఈ రెండున్నర ఎకరాల భూమి విషయంలో కొన్ని సంవత్సరాలుగా వివాదం నడుస్తోంది. అందులో 1.11 ఎకరాల భూమి తమదేనని 15 మంది బాధితులు మే 18వ తేదీన ఫెన్సింగ్ వేసుకున్నారు. దీంతో మాజీమంత్రి మల్లారెడ్డి, ఆయన అల్లుడు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి తమ మనుషులతో ఆ కంచెను తొలగించారు.

భూమి మొత్తం తమదేనని వాదించారు. ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని పేట్ బషీరాబాద్ పోలీసులు సూచించినా మల్లారెడ్డి ససేమిరా అనడంతో సమస్య తీవ్రరూపం దాల్చింది. ఈ వివాదంలో ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కూడా బాధితుడే. గతంలో సర్వే కోసం రావాలని ఎన్నిసార్లు పిలిచినా ఆయన రాలేదని, సర్వే అవసరంలేదని బెదిరింపులకు పాల్పడ్డారని మల్లారెడ్డిపై ప్రత్యర్థి వర్గం ఆరోపణలు చేసింది.

82/ఈ సర్వే నెంబర్‌లోని భూమిపై ఇన్‌జంక్షన్ ఆర్డర్ వేసినా కౌంటర్ దాఖలు చేయలేదని, అప్పటి మంత్రి కేటీఆర్ ఈ సమస్యను సెటిల్‌మెంట్ చేసుకోవాలని సూచించినా మల్లారెడ్డి పెడచెవిన పెట్టారని ఆరోపించారు. గత నెలలో ఇరు వర్గాలు ఘర్షణ పడటంతో ప్రభుత్వం స్పందించి ఇరువర్గాల  సమక్షంలో రెవెన్యూ అధికారులతో సర్వే చేయించింది. దీంతో ఆ స్థలంలో 33 గుంటలు మల్లారెడ్డి కబ్జా చేశారని అధికారులు తేల్చారు. ఈ నివేదికను హైకోర్టుతోపాటు పోలీసులకు కూడా రెవెన్యూ అధికారులు అందజేశారు.