11 March, 2026 | 4:16 AM

రైతు రుణ భారం తెలంగాణలోనే తక్కువ

11-03-2026 01:09 AM
  1. రుణమాఫీతో తీరిన అన్నదాతల వెతలు
  2. దక్షిణాది రాష్ట్రాల్లో మనమే ఉత్తమం

హైదరాబాద్, మార్చి 10 (విజయక్రాంతి): దక్షిణ భారత రాష్ట్రాల్లో రైతులకు రు ణ భారం తక్కువగా తెలంగాణలోనే ఉంది. వ్యవసాయ ప్రధానమైన కర్ణాటక, తమిళనా డు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో రైతులకు ఉన్న రుణభారం చాలా తక్కువగా ఉంది. వివిధ రాష్ట్రాల్లో రైతులకు ఉన్న అప్పుల మొత్తంపై లోక్‌సభలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఓ ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

దాని ప్రకారం 2025, డిసెంబరు 31 నాటికి తెలంగాణలో రైతులకు ఉన్న మొత్తం అప్పులు రూ.1,75,960.56 కోట్లు. ఇందులో పంట రుణాలు రూ.95,167.98 కోట్లు, టర్మ్ రుణాలు రూ.80,792.58 కోట్లు ఉన్నట్లు తెలిపారు. అదే సమయంలో కర్ణాటకలో రైతులపై ఉన్న మొత్తం అప్పులు రూ.2,10,244.47 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లో రైతులపై ఉన్న మొత్తం రుణ భారం రూ.3,75,254.59 కోట్లు, తమిళనాడు రైతులపై ఉన్న మొత్తం అప్పుల భారం రూ.5,06,290.45 కోట్లు కేంద్రం వెల్లడించింది.

తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం 2024లో రూ.21 వేల కోట్లపైగా రుణమాఫీ చేయడంతో రైతులపై రుణభారం తగ్గింది. ఫలితంగానే దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణలోనే రైతులకు తక్కువ అప్పులున్నాయి. రైతు రుణభారంపై నాబార్డ్ 2025, డిసెంబరు 31 నాటికి కటాఫ్ డేట్‌గా తీసుకొని కేంద్రానికి సమాచారం ఇచ్చింది.