calender_icon.png 2 February, 2026 | 6:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేంద్ర బడ్జెట్ సంపన్న వర్గాలకు అనుకూలమే

02-02-2026 05:16:43 PM

రైతులు, యువతకు నిరాశ మిగిలింది

విద్యార్థుల రాజకీయ పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జి శరత్

మునిపల్లి,(విజయక్రాంతి): 2026-27 రూపొందించిన “హైటెక్ బడ్జెట్” సంపన్న వర్గాలకు అనుకూలముగా ఉందని,  రైతులు, యువతకు మాత్రం  నిరాశ మిగిల్చిందని విద్యార్థుల రాజకీయ పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జి శరత్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం సోమవారం నాడు ప్రవేశపెట్టిన బడ్జెట్ పేదలు, మధ్య తరగతి, రైతులు, యువత, మహిళలకు తీవ్ర నిరాశ కలిగించే విధంగా ఉందని అయన మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఈ బడ్జెట్ కార్పొరేట్ సంస్థలకు మేలు చేసే విధంగా మాత్రమే రూపకల్పన చేయబడిందని, పేదల సంక్షేమానికి అవసరమైన నిధులు సరైన స్థాయిలో కేటాయించలేదని తెలిపారు. ఇది సంపన్న వర్గాలకు అనుకూలంగా రూపొందించిన “హైటెక్ బడ్జెట్” మాత్రమేనని విమర్శించారు.

అలాగే వేతన జీవులు, రోజువారీగా చిన్న ఉద్యోగాలు చేసే మధ్య తరగతి ప్రజలు ఆదాయ పన్నులో ఊరట లభిస్తుందన్న ఆశలు పెట్టుకున్నారని, కానీ వాటిని పూర్తిగా విస్మరించిన బడ్జెట్‌గా ఇది మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. పెరిగిన ధరలు, జీవన వ్యయం దృష్టిలో పెట్టుకుని ఐటీ స్లాబ్‌లలో మార్పులు చేస్తారని భావించామని, కానీ ప్రభుత్వం ఆ దిశగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదన్నారు. నిధుల పెంపు వంటి కీలక అంశాలను ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. ప్రభుత్వ సంస్థలకు పేర్లు మార్చడం తప్ప పేదల జీవితాల్లో మార్పు తీసుకురావాలన్న సంకల్పం కేంద్ర ప్రభుత్వానికి లేదని ఆరోపించారు.

పన్నుల రూపంలో తెలంగాణ రాష్ట్రం నుండి దేశ ఖజానాకు అత్యధికంగా నిధులు వెళ్లుతున్నప్పటికీ, అదే స్థాయిలో తెలంగాణకు కేంద్ర బడ్జెట్‌లో న్యాయం జరగడం లేదని శరత్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి అత్యంత కీలకమైన రైల్వే లైన్ల విస్తరణ, కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు, మెట్రో కారిడార్ విస్తరణ, విమానాశ్రయాల అభివృద్ధి, భారత్ ఫ్యూచర్ సిటీ వంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులు, కొత్త జాతీయ రహదారుల నిర్మాణం, అలాగే నిరుద్యోగ సమస్య నివారణకు అవసరమైన ఉద్యోగ–ఉపాధి పథకాలకు కేంద్ర బడ్జెట్‌లో సరైన కేటాయింపులు లేకపోవడం దురదృష్టకరమన్నారు.

అదే విధంగా యువత ఉపాధి, మహిళల సాధికారత, సాగురంగ అభివృద్ధికి సంబంధించిన స్పష్టమైన విధానాలు ఈ బడ్జెట్‌లో కనిపించలేదని, ఇది మోడీ సర్కార్ ప్రజల ప్రాధాన్యతలను విస్మరించినట్లు స్పష్టంగా సూచిస్తోందన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక శక్తి, ఉపాధి హామీ వంటి భవిష్యత్ తరాలకు కీలకమైన రంగాలను కూడా ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. పెరిగిన ధరలకు తగ్గట్టు ప్రజలకు ఉపశమనం కలిగించే చర్యలు తీసుకోవడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది అని పేర్కొన్నారు.