13 July, 2026 | 2:07 AM

జాడ లేని వానలు.. ఎండుతున్న పంటలు..

13-07-2026 12:33 AM

మఠంపల్లి జులై 12: మృగ శిర, ఆరుద్ర దాటినా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో మఠంపల్లి మండల రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తొలి వర్షాలకు సాగు పనులు ప్రారంభించిన రైతులు ప్రస్తుతం వర్షాల జాడ లేకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మండలంలోని మఠంపల్లి, పెదవీడు అగ్రి క్లస్టర్ పరిధిలోని పలు గ్రామాల్లో మూడు వేలకు పైగా ఎకరాల్లో వేసిన పత్తి పంటలు తగిన తేమ లేక వాడిపోతుండటంతో అలాగే కొన్ని చోట్ల పత్తి గింజలు మొలకెత్తిన తర్వాత వర్షాలు లేక ఎండిపోయాయి.దీంతో వర్ష కాలం సాగు పై తీవ్ర సందిగ్ధ నెలకొంది.

మరో వైపు వరి పంట సాగు చేసే రైతులు నార్లు పోసుకొని, దుక్కులు దున్ని వర్షం కోసం ఎదురు చూస్తున్న కానీ అదును దాటి నార్లు ముదిరిపోవడంతో ఉసూరుమంటున్నారు. సీజన్ లో కళ కళలాడాల్సిన చెరువులు, కుంటలు,చెక్ డ్యాంలు నిండక వెలవెలబోతుండటంతో భూగర్భ జలాలు కూడా అడుగంటుతున్నాయి.మరి కొన్ని చోట్ల మొలకెత్తిన పంటను కాపాడుకునేందుకు సాగు నీటి వనరులున్న రైతులు బోర్లు, డ్రిప్, స్ప్రింకర్లతో నానా పాట్లు పడుతుండగా వర్షధారంగా మెట్ట పంటలు వేసే వారు తీవ్ర ఇక్కట్లు ఎదురుకుంటున్నారు.

ఇప్పటికే సాగు కోసం భారీగా పెట్టుబడులు పెట్టిన రైతులు, ము న్ముందు వర్షాలు కురవకపోతే మరింత నష్టపోయే ప్రమాదముంది. వాతావరణంలో మేఘాలు కనిపిస్తున్నప్పటికీ వర్షం మాత్రం కురవకపోవడంతో ఎండ తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో పశువులకు తాగునీరు,మేత కొరత కూడా ఏర్పడుతోంది. ఇప్పటికైనా విస్తారంగా వర్షాలు కురిసి పంటలు గట్టెక్కాలని రైతులు ఆశాభావంతో ఎదురుచూస్తున్నారు.