విత్తనాల కోసం రైతుల పడిగాపులు
27-05-2024 12:30 AM
కామారెడ్డి, మే 26 (విజయక్రాంతి): విత్తనాల కోసం రైతులకు తిప్పలు మొదల య్యాయి. వ్యవసాయ సీజన్ రావడంతో విత్తనాలు, ఎరువుల కోసం ఆందోళన చెందుతున్నారు. ఆదివారం రాజంపేట మండలం ఆర్గోండ సింగిల్ విండో కార్యాలయం వద్ద ఉదయం నుంచి రైతులు పడిగాపులు కాశారు. ఎండ కొడుతున్నప్పటికీ క్యూ లైన్లో నిల్చొని ఇబ్బందులు పడ్డారు. ఎండ తీవ్రతకు తట్టుకోలేక పాసు పుస్తకాల జిరాక్స్‌లను లైన్‌లో పెట్టారు. ఇంత ఇబ్బందులు పడినా సరిపడా విత్తనాలు, ఎరువులు లేకపోవడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పలు గ్రామాల రైతులు పెద్ద ఎత్తున రావడంతో అధికారులు చేతులెత్తేశారు. విండో అధికారులు జిల్లాస్థాయి అధికారులతో మాట్లాడి సరిపడా జీలుగు విత్తనాలు, ఎరువులను సరఫరా చేస్తామని, ఆందోళన చెందవద్దని రైతులకు నచ్చజెప్పారు.






