5 August, 2026 | 7:55 PM

అలాంటి ఉద్యమాన్ని చూడలేం

27-05-2024 12:32 AM

తెలంగాణ ఉద్యమం చారిత్రాత్మకమైన ప్రజాస్వామిక ఉద్యమం. తెలంగాణ ప్రజలు ఉవ్వెత్తున ఎగిసిపడిన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని ఉద్యోగస్తులుగా మేము సైతం కదం తొక్కి వీరోచితమైన పోరాటంలో భాగస్వా మ్యం అయ్యాం. 2009 నుంచి టీఎన్‌జీవోలో, 2012 నుంచి టీజీవోలో నాయకత్వ బాధ్యతలు చేపట్టాను. ఈ సమయంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 24 నియోజకవర్గాలలో అధికారులు, ఉద్యోగులను ఏకతాటిపైకి తీసుకొచ్చాం. ముఖ్యంగా పోలీస్ కానిస్టేబుల్ కిష్టయ్య, ఓయూలో వేణుగోపాల్ రెడ్డి ప్రాణ త్యాగాలతో చలించి పోయాను. 1969లో 369 మంది, 2009 మలిదశ ఉద్యమంలో 1200 మంది బలిదానాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. 

 టీజీవో హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు

ఎంబి కృష్ణయాదవ్ 

ఉద్యమంలో ఉన్నందుకు గర్వంగా ఉంది

ఉమ్మడి ఆంధ్రా పాలనలో నాటి పాలకులు 610 జీవో అమలు చేయకపోవడంతో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి పునాదులు పడ్డాయి.  నాడు అధ్యయన కమిటీలన్నీ  తెలంగాణకు అన్యాయం జరిగిందని తేల్చాయి. నాడు పెద్ద ఎత్తున ఉద్యమించాం. తెలంగాణ జోన్ పరిధిలోనే హైదరాబాద్ ఉన్నప్పటికీ, నాటి పాలకులు  హైదరాబాద్‌ను ఫ్రీజోన్‌గా చేశారు. హైదరాబాద్‌లో అసలు తెలంగాణ వాదమే లేదని ప్రచారం ప్రారంభించారు. ఫ్రీజోన్ చేయడాన్ని మా ఉద్యోగ సంఘాలన్నీ వ్యతిరేకించాయి. నాడు సిద్దిపేటలో ఉద్యోగ గర్జన పేరుతో పెద్ద సభ నిర్వహించాం. మున్సిపల్ ఉద్యోగులందర్నీ సాగరహారం, మిలియన్ మార్చ్, సకల జనుల సమ్మె, వంటా వార్పులో భాగస్వామిని చేశాం. ఉద్యమంలో భాగస్వామిని అయినందుకు గర్వంగా ఉంది.

 డాక్టర్ తిప్పర్తి యాదయ్య,

ఉద్యమకారుడు,

మున్సిపల్ జేఏసీ చైర్మన్, హైదరాబాద్

ఉద్యమ లక్ష్యాన్ని భ్రష్టుపట్టించారు

నీళ్లు, నియామకాలు, నిధుల కోసమే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. స్వరాష్ట్రం ఏర్పడినప్పటికీ తెలంగాణ ఉద్యోగులకు ఒరిగింది ఏమీలేదు. పదేళ్ల పాటు పాలకులు మా గోడు వినేందుకు కూడా అవకాశం ఇవ్వలేదు. తెలంగాణ రాష్టం ఏర్పడితే ఉద్యోగాలు వస్తాయని, ఖాళీలన్నీ భర్తీ అవుతాయని భావించాం. ఉద్యోగులం దరూ ఏకతాటిపై జేఏసీగా ఏర్పడి సకలజనుల సమ్మె, మిలియన్ మార్చ్‌లో పాల్గొని ఉద్యమానికి ఊపిరి పోశాం. గత ప్రభుత్వంలో ఉద్యోగులకు జీతాలు కూడా సరిగా  ఇవ్వలేదు.  కొత్త సర్కారైనా నిజమైన తెలంగాణ లక్ష్యాన్ని సాకారం చేస్తుందని ఆశిస్తున్నాం. ఉద్యమకారులను గుర్తించి వారికి న్యాయం చేయాలని కోరుతున్నాం. 

 దొంత నరేందర్,

టీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు,

మెదక్ జిల్లా

ఉద్యోగానికి రాజీనామా చేశా

మలి దశ తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ ఉద్యోగుల జేఏసీ అడ్వయిజర్‌గా పనిచేశా. ఉద్యమంలో అన్ని యూనియన్లను ఏకతాటిపైకి తెచ్చి ఉద్యమంలో పాలు పంచుకున్నాం. రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత పాలకులు యూనియన్లలో చీలికలు తెచ్చి ఉద్యమ లక్ష్యాన్ని నీరుగార్చారు. యూనియన్లపై ఉక్కుపాదం మోపడంతో పలువురు ఆర్టీసీ కార్మికులు చనిపోయారు. దీంతో ఉద్యోగానికి రాజీనామా చేశాను. ఉద్యమం కోసం సొంత డబ్బులు ఖర్చు చేశాను. గత పాలకుల స్వార్థపూరిత చర్యల వల్ల ఆర్టీసీ ఎంతో నష్టానికి గురైంది. స్వరాష్ట్రంలో న్యాయం జరుగుతుందని ఉద్యమంలో పాలుపంచుకున్న వారికి అన్యాయమే జరిగింది. ఉద్యమకారులకు కొత్త సర్కార్ న్యాయం చేయడమే కాకుండా ఉద్యోగుల హక్కులను కాపాడాలి.                          

 సుభాష్‌చంద్రబోస్,

ఆర్టీసీ మాజీ ఉద్యోగి, మెదక్