వైవిధ్య పంటల సాగుపై రైతులకు అవగాహన
మహబూబాబాద్, జులై 10 (విజయక్రాంతి): మహబూబాబాద్ మండలంలోని ఈదులపూసపల్లి గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు రైతులకు అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో ప్రత్యామ్నాయ పంటలు, వైవిధ్యీకరణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా వ్యవసాయ అధికారి స్వర్ణ విజయచంద్ర మాట్లాడుతూ ప్రస్తుత వానాకాలంలో ఎల్ నినో ప్రభావం కారణంగా సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నందున రైతులు వాతావరణ పరిస్థితులను నిరంతరం గమనిస్తూ వ్యవసాయ శాఖ సూచనలకు అనుగుణంగా పంటల ప్రణాళిక రూపొందించుకోవాలని తెలిపారు.
ముఖ్యంగా ఆలస్యంగా వర్షాలు కురిసే పరిస్థితుల్లో లేదా వర్షాభావం నెలకొన్నప్పుడు అధిక నీటి అవసరం ఉన్న పంటలకు బదులుగా తక్కువ నీటి అవసరం ఉన్న ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయడం ద్వారా నష్టాలను గణనీయంగా తగ్గించుకోవచ్చని పేర్కొన్నారు.
వర్షాధార ప్రాంతాల్లో పెసర, మినుము, కందులు, జొన్న, అలసంద వంటి పప్పు, చిరుధాన్య పంటలతో పాటు వివిధ రకాల కూరగాయల పంటలు సాగు చేయడం రైతులకు ఆర్థికంగా లాభదాయకమని వివరించారు. అలాగే అనుకూల ప్రాంతాల్లో ఆయిల్ పామ్ సాగును విస్తరించాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి తిరుపతి రెడ్డి, వ్యవసాయ విస్తరణ అధికారి పున్నమి, రైతులు పాల్గొన్నారు.






