అంతర పంటల సాగు ద్వారా రైతులు ఆర్థిక అభివృద్ధి చెందవచ్చు
జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్...
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): రైతులు ఒకే పంట మీదే ఆధారపడకుండా అంతర్ పంటల సాగు ద్వారా ఆర్థిక అభివృద్ధి చెందవచ్చు అని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. శనివారం ములకలపల్లి మండలంలో కలెక్టర్ పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ముందుగా ములకలపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మట్టితో తయారుచేసిన ఇటుకలతో నిర్మించే ప్రహరీ గోడ పనులను కలెక్టర్ పరిశీలించి తగు సూచనలు చేశారు. ఈ ప్రహరీ గోడ నిర్మాణానికి స్థానికంగా మట్టితో తయారుచేసిన ఇటుకలను ఉపయోగించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం పాతూరులో ఈదర మురళి అనే రైతు సాగు చేస్తున్నటువంటి ఫామ్ పౌండ్ లో చేపల పెంపకాన్ని పరిశీలించి, ఇంకా ఫామ్ పాండ్ అభివృద్ధి పరచటానికి, ఏ రకం చేపల పెంపకం ద్వారా ఎక్కువ ఆదాయం చేకూరుతుందో తగు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... రైతులు ఒక్క పంటపైనే ఆధారపడకుండా అంతర్ పంటగ చేపల పెంపకం, మునగ, నాటు కోళ్లు, తేనెటీగల పెంపకం వంటివి సాగు చేయడం ద్వారా ఆర్థిక అభివృద్ధి చెందవచ్చు అని తెలిపారు. ఈ అంతర పంటల సాగుకు ఎన్ ఆర్ జి ఎస్ ద్వారా మునగ పంట వేసుకున్న వారికి అన్ని విధాలుగా ప్రోత్సాహకాలు సబ్సిడీలు అందుతాయని అదేవిధంగా పంట చేనులో ఫారం ఫాండ్లు ఎన్ ఆర్ జి ఎస్ ద్వారా తీయడం జరుగుతుందని ఈ ఫారం పాండ్లలో రైతులు చేపల పెంపకం చేసుకుంటే లాభదాయకంగా ఉంటుందని తెలిపారు. ఈ పర్యటనలో కలెక్టర్ వెంట ఎంపీడీవో రేవతి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.




