రైతులతో రాజకీయాలు చేయొద్దు
రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి హెచ్చరిక
చేగుంట, మే 12 : మెదక్ జిల్లా చేగుంట మండలం కర్ణంపల్లి గ్రామంలోని ఐకేవీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, రాష్ట్ర రైతు కమిషన్ సభ్యురాలు భవాని రెడ్డి, దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి కలిసి మంగళవారం పరిశీలించారు. కొనుగోలు కేంద్రంలో ధాన్యం నిల్వలు, రైతులకు కల్పిస్తున్న సౌకర్యాలు, తూకం ప్రక్రియ, ధాన్యం తరలింపు పరిస్థితులను వారు అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంత రం రైతులతో మాట్లాడి, వారి సమస్యలను నేరుగా వినిపించుకున్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ రైతులతో రాజకీయాలు చేయడం సరికాదని, మాజీ మంత్రి హరీష్‌రావుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ప్రతిపక్షంలో ఉన్న నాయకులు రైతుల సమస్యల పరిష్కారానికి సహ కరించాల్సిన బాధ్యత ఉందని, కానీ రైతులను రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం మంచిది కాదన్నారు. రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటు న్న సమయంలో వారికి అండగా నిలబడాల్సింది పోయి, రాజకీయ విమర్శలు చేయడం బాధాకరమన్నారు.
కొనుగోలు కేంద్రాల్లో ఎక్కడైనా సమస్యలు ఉంటే సంబంధిత జిల్లా కలెక్టర్, రాష్ట్ర రైతు కమిషన్ లేదా సంబంధిత శాఖ మంత్రుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. అనంతరం జిల్లా అధికారులతో ప్రత్యేకంగా మాట్లాడిన కోదండరెడ్డి కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోయిన ధాన్యాన్ని వెంటనే తరలించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ముఖ్యంగా రెండు రోజుల్లోగా కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని పూర్తిస్థాయిలో తరలించాలని జిల్లా డిఆర్‌ఓ కు స్పష్టం చేశారు.
రాష్ట్ర రైతు కమిషన్ సభ్యురాలు భవాని రెడ్డి మాట్లాడుతూ రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇంచా ర్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రైతుల పంటకు గిట్టుబాటు ధర కల్పించడం, కొనుగోలు ప్రక్రియలో పారదర్శకత తీసుకురావడం ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌ఓ రాజేశ్వర్, ఏఎస్‌ఓ, తాసిల్దార్ శివప్రసాద్, రామయంపేట్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ సైదా, చేగుంట ఎంపీడీఓ చిన్నారెడ్డి, మం డల వ్యవసాయ అధికారి హరిప్రసాద్, కాంగ్రెస్ నాయకులు రైతులు పాల్గొన్నారు.






